పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పవిత్రాత్ముడు మన హృదయాల్లో క్రీస్తుపట్ల విశ్వాసాన్ని పట్టిస్తాడు. ఈ విశ్వాసమే ఇక్కడ అభిషేకం అని చెప్పబడింది. పవిత్రాత్మ మన హృదయాల్లో క్రీస్తుపట్ల విశ్వాసం పట్టిస్తూ మనం ఆ క్రీస్తు కట్టడల ప్రకారం జీవించేలా చేస్తుంది.

ఆత్మ తన శక్తితో మన చిత్తశక్తికి బలాన్ని దయచేస్తుంది. ఈ బలంతోనే మన చిత్తశక్తి ఆయా నైతికక్రియలను నిర్వహిస్తుంది. చెట్ట పండ్లుకాస్తుంది, తల్లి బిడ్డను కంటుంది. అలాగే మన చిత్తశక్తికూడ ఆయా నైతిక క్రియలను నిర్వహిస్తుంది. ఆ క్రియలను పండ్లలా కాస్తుంది. ఈ శక్తి దానికి ఆత్మనుండే లభిస్తుంది. ఆత్మ మన హృదయంలో ప్రేమ, ఆనందం, శాంతి మొదలైన తొమ్మిది పండ్లు ఫలించేలా చేస్తుందని పౌలు నుడివాడు - గల 5,22. ఫలితాంశమేమిటంటే, నూత్నవేదకాలంలోనైతికజీవితం గడపాలనే అభిలాష మన హృదయంలోనుండే వస్తుంది. ఆత్మే ఆ యభిలాషను మన అంతరంగంలో మొలకెత్తిస్తుంది. కనుకనే నైతికంగా జీవించడం మనకు అంత కష్టమనిపించదు. ఈ భావాలన్నిటినీ సంగ్రహంగా తెలియజేసూ పౌలు "దేవుని ఆత్మ నడిపించేవాళ్ళ దేవుని పత్రులు" అని వాకొన్నాడు - రోమా 8,14.

2.1 యోహాను 3,9 దైవప్రకృతి (దైవబీజం) మనలోనే వుంది కనుక మనం పాపకార్యాలు చేస్తూ పోమని చెప్తుంది. 1 యోహాను 2,20 మరియు 27 వచనాల్లో అభిషేకాన్ని గూర్చి చెప్పాడు, ఈ దైవప్రకృతీ ఈ యభిషేకమూ రెండూ మన హృదయంలోని దైవవాక్కునే సూచిస్తాయి, ఆత్మ మన హృదయంలోని ఈ వాక్కుపై పనిచేసి మన మనస్సులో క్రీస్తుపట్ల విశ్వాసం పుట్టిస్తుంది. మనం అతని కట్టడల ప్రకారం జీవించేలా చేస్తుంది. క్రీస్తు భక్తులమయ్యేలా చేస్తుంది. క్రీస్తు మనకు తండ్రిని తెలియజేస్తాడు. కాని ఆత్మ మనకు క్రీస్తుని తెలియజేస్తుంది. క్రీస్తు తండ్రికి ప్రియకుమారుడు. ఆత్మ మనంకూడ క్రీస్తుద్వారా తండ్రికి ప్రీతిపాత్రులమైన బిడ్డలమయ్యేలా చేస్తుంది. ఆత్మ మనలను క్రీస్తు చెంతకు తీసికొనిపోగా, క్రీస్తు మనలను తండ్రి చెంతకు చేరుస్తాడు. కనుక మన క్రైస్తవ విశాస్వమూ భక్తి సత్ర్కియలూ నైతిక జీవితమూ పాపం నుండి వైదొలగడమూ అన్నీ ఆత్మద్వారానే జరుగుతాయి. మన నైతిక జీవితానికి కర్త ఆత్మే.

ప్రార్ధనా భావాలు

1. ఆత్మ అభ్యంగన తైలంలాగ మెల్లగా మనలోనికి ప్రవేశిస్తుంది. మన పాపాలనూ స్వార్థబుద్ధినీ మనం గ్రహించేలా చేస్తుంది, మనం వాటి కొరకు పశ్చాత్తాపపడేలా చేస్తుంది. అటుపిమ్మట మన పాపాలను మన్నిస్తుంది. కనుక క్రీస్తుతోపాటు ఆత్మకూడ మనకు పాపపరిహారాన్ని దయచేస్తుంది.