పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవునివైపు ఆకర్షిస్తుంటుంది, ఆయాత్మ అనుగ్రహంవల్ల నరుడు దేవునిపట్ల భక్తి పెంచుకొంటాడు. అతన్నిచేరి అతనితో కలసిపోగోరుతాడు. మనలోవున్నదేవుని రూపం మనం దేవునికి చెందినవాళ్ళమని నిరూపించే దివ్యముద్ర.

మనలో వసించి మన హృదయంలో దైవరూపాన్ని చిత్రించే ఆత్మ మూడు పనులు చేస్తుంది. మనం దేవునితో, క్రీస్తుతో ఐక్యమై జీవించేలా చేస్తుంది. తోడినరులతో ప్రేమభావంతో కలసిమెలసి వుండేలా చేస్తుంది. మన దైవస్వభావాన్ని మనం గుర్తించి దివ్యత్వం గలవారిలా బాధ్యతాయుతంగా జీవించేలా చేస్తుంది. ఆత్మద్వారా దేవుని పోలికను పొంది వుండడం నరుని మహాభాగ్యాల్లో వొకటి అని చెప్పాలి.

ప్రార్థనా భావాలు

1. బైబులు గ్రంథాలను వ్రాయించింది ఆత్మ పవిత్ర గ్రంథంలో ఆత్మ నెలకొని వుంటుంది. ఐతే ఆత్మ జీవం.ఆ దివ్యవ్యక్తి సాన్నిధ్యం వలన బైబులు వాక్కు సజీవవాక్కు ఔతుంది. జ్ఞానస్నాన సమయంలో క్రీస్తు మీదికి దిగివచ్చినట్లుగా ఆత్మడు దైవవాక్కులోనికికూడ దిగివచ్చి దాన్ని సజీవం చేస్తాడు - హెబ్రే 4, 12. ఈలా ఆత్మతో నిండివున్న జీవవాక్కుని మనం భక్తితో పఠించాలి. ఇంకా, మనం ఆత్మశక్తితోనే వేదవాక్కుని అర్థంచేసికొంటాం గూడ. ఆ దివ్యవ్యక్తి అనుగ్రహించందే బైబులు ఎవ్వరికీ బోధపడదు.

2. గ్రెగొరీ నాసియాన్సన్ భక్తుడు ఈలా వ్రాసాడు. క్రీస్తు జన్మించాడు. ఆత్మడు అతనికి ముందుగా మార్గం సిద్ధంజేసాడు. క్రీస్తు జ్ఞానస్నానం పొందాడు. దివ్యాత్ముడు అతనికి సాక్ష్యం పలికాడు. క్రీస్తు శోధనలకు గురయ్యాడు. ఆత్మడు అతన్ని యెడారికి కొనిపోయాడు. ప్రభువు అద్భుతాలు చేసాడు. ఆత్మడు అతనికి శక్తినిచ్చాడు. క్రీస్తు మోక్షారోహణం చేసాడు. ఆత్మడు ఇప్పడు అతని వుద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. ఈలా ఆ యిద్దరికీ ఎడతెగని సంబంధం వుంది.

18. దైవ పుత్రత్వమొసగే ఆత్మ

l. జ్ఞానస్నాన సమయంలోనే పవిత్రాత్మ మనలను దేవుని పుత్రులనుగాను పుత్రికలనుగాను చేస్తుంది. మనం దత్తపుత్రత్వాన్నొసగే ఆత్మను స్వీకరించాం. ఆ యాత్మద్వారా దేవుని అబ్బా అనగా నాన్నా అని పిలుస్తాం - రోమా 8,15. పూర్వవేదంలోని