పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడినపుడూ వారికి పశ్చాత్తాపం కలగాలని ప్రార్థన చేయాలి. వరప్రసాదమే గనుక మనలను ఆదుకోకపోయినట్లయితే, మనం అంతకంటె పెద్దపాపమే చేసివుండేవాళ్ళమని అనుకోవాలి.

తరచుగా అహంకారంకొద్దీ ఇతరులకంటె మనమే యోగ్యులమని తలుస్తూంటాం. మనలను మనం గొప్ప జేసికొని ఇతరులను చిన్నచూపు చూస్తుంటాం, కాని ఇది పద్ధతి కాదు. “వినయంతో ఇతరులను మీకంటె అధికులనుగా భావించండి" అని చెప్పాడు పౌలు - ఫిలి 2,3, ఇతరుల్లో మనం గుర్తించని మంచీ వరప్రసాదమూ బోలెడంత వుండవచ్చుగదా! కనుక పరులు మనకంటె యోగ్యులని భావించడం కష్టం కాకూడదు. మొత్తం మీద చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తేనేతప్ప తోడి నరులపట్ల వినయాన్ని ప్రదర్శించలేం.

3) వ్యక్తిగత జీవితంలో వినయం. మన హృదయంలోను బాహ్యక్రియల్లోను వినయం వుండాలి.

మన హృదయంలో వినయముండాలి. కనుక మనలను మనం అతిగా నమ్మకూడదు. మనలనుగూర్చి మనం గొప్పగా అంచనా వేసికోగూడదు. "నీ శక్తికి మించిన కార్యాలను అర్థంచేసికోవాలని యత్నం చేయకు. నీ కందని విషయాలను పరీశీలించాలని ప్రయాసపడకు" - సీరా 3,21.

ఇంకా దేవుడు మనకిచ్చిన వరాలతో తోడి నరులకు సేవలు చేయాలి. అంతేగాని వాటి ద్వారా మనకు మనం గొప్పను ఆపాదించుకోగూడదు. వాటి ద్వారా మనకు కీర్తిని తెచ్చుకోవాలని తాపత్రయ పడకూడదు. ఈలా చేసేవాళ్లు క్రీస్తునిగాక తమ్ముతామే ప్రకటించుకొన్నట్లవుతుంది. దేవుడు మనకిచ్చిన వరాలతో దేవునికే కీర్తి రప్పించాలిగాని మనకు మనం కీర్తి తెచ్చుకోగూడదు.

ఇంకా మనం గొప్ప పదవులనూ గౌరవాలనూ ఆశించగూడదు. పేరు తెచ్చుకోవాలనే దురదను అణచుకోవాలి. పునీతులు గుప్తజీవితం జీవించారు. వారినాటి ప్రజలకు వారి గొప్పతనం తెలియనే తెలియదు. ఎవరు ఊరూపేరూ లేనివాళ్లుగానూ విలువ లేనివాళ్ళగానూ చలామణికాగోరుతారో వాళ్లే నిజంగా మహాత్ములు. వినయాత్మలు ఎప్పడుకూడ అందరి కంటె క్రింది స్థానంలో కూర్చుంటారు - లూకా 14,10. ఈ సూత్రాలు మనకుకూడ ఆదర్శం కావాలి.

ఇక, మన బాహ్యక్రియల్లోగూడ వినయం కన్పించాలి. కొందరు షోకైన దుస్తులను ధరిస్తారు. తమ యిండ్లను షోకుషోకుగా అలంకరించుకొంటారు. కాని వినయంగా వుండేవాళస్తే అతి సాదాగా కన్పిస్తారు. సాదాదుస్తులతోను అలంకరణలతోను సరిపెట్టుకొంటారు. మనం నిల్చుండే తీరులోను కూర్చుండే తీరులోను కూడ వినయం కన్పించాలి. ఇతరులను మర్యాదతో ఆహ్వానించి వారి అవసరాలను తీర్చే పద్ధతిలోను, వారికి పరిచర్య చేసే రీతిలోనుగూడ వినయం కన్పించాలి.