పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుని నుండి వరప్రసాదాలను సంపాదించి పెడుతుంది. అందుచేత క్రైస్తవ భక్తుడు వినయం గొప్పతనాన్ని అర్థం చేసికొని ఆ పుణ్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి.

రెండవది, వినమత అన్ని పుణ్యాలకు పునాదిలాంటిది. అది లేందే ఏ పుణ్యమూ వృద్ధి చెందదు. వినయంలేని హృదయంలో విశ్వాసం నమ్మకం దేవప్రేమ పెంపొందవు. ఆలాగే వినవ్రుత లేనికాడ వివేకం, న్యాయం, మితత్వం మొదలైన పుణ్యాలుకూడ అభివృద్ధి చెందవు. కావుననే పునీత పెద్ద గ్రెగొరీగారు “వినయం అన్ని పుణ్యాలకు తల్లిలాంటిది. అన్ని పుణ్యాలకు దుంపలాంటిది. కనుక వినయం అనే దుంపనుండి చిగురించిన పుణ్యం ఏదైనా వృద్థి చెందుతుంది. దుపంనుండి చిగురింపని పుణ్యం ఏదీ వికసింపదు. దానికి ఆధారం లేదు" అని వ్రాసారు. ఆగస్టీను భక్తుడు కూడ “మనం పైకి ఎక్కాలంటే మొదట క్రిందకు దిగడం నేర్చుకోవాలి. ఆకాశాన్నితాకే గోపురాన్ని కట్టాలంటే మొదట దాని పునాదిని పటిష్టంగా నిర్మించాలి, ఆ పునాదే వినయం" అని వ్రాసాడు, కనుక క్రైస్తవుల్లో వినయం అనేది బలంగా వుండాలి. అది లేకపోతే అసలు క్రైస్తవ జీవితమే లేదు.

3. వినయానికి వ్యతిరేకమైన పాపాలు

వినయానికి వ్యతిరేకమైన పాపాలు చాల రూపాల్లో కన్పిస్తాయి. కొందరు తామే అధికులమని యెంచుతుంటారు. తమ తక్కువతనాన్నీ తప్పిదాలనూ తాము గుర్తించరు. వీళ్లు అందరినీ అన్ని సంఘటనలనూ విమర్శిస్తూంటారు. ఇతరుల్లో తప్పలెన్నేవాళ్ళు తమ తప్పలను తాము గుర్తించలేరు కదా! ఇంకా కొందరు తమలోని మేలిగుణాలన్నిటికీ తామే కర్తలైనట్లుగా భావించి విర్రవీగుతుంటారు. డాబూ, దర్పమూ ప్రదర్శిస్తుంటారు. ఆ మేలి గుణాలకు దేవునికి వందనాలర్పించరు. వీలైనప్పడల్లా తమ్ముతామే పొగడుకొంటుంటారు.

మరికొందరు వాళ్ళల్లోని శక్తిసామర్థ్యాలను బాగా ప్రకటనం చేసికొంటారు. తమలోని లోపాలను మాత్రం జాగ్రత్తగా కప్పిపెట్టుకొంటారు. లోకం యెదుట మంచి వాళ్ళగా సమర్థులుగా చలామణి ఔతారు. తమకు తామే మంచిపేరు ఆపాదించుకొంటారు. ఇది నిక్కంగా వంచన.

అవినయాత్మలు నానారూపాల్లో కన్పిస్తారు. కొందరు పొగరుబోతులు. వీళ్ళు నిరంతరం తమ్ముతాము కీర్తించుకొంటుంటారు. కొందరు ఆడంబర ప్రియలు. వీళ్ళ తమ చేతల్లోను వేషభాషల్లోను ఆడంబరాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు ఆశాపరులు. వీళ్ళ తమ శక్తిని మించి పదవులను ఆశిస్తారు. కొందరికి దుస్సాహసం మెండు. వీళ్ళ తమ శక్తికి మించిన కార్యాలను చేపడతారు. వాటిని సాధించలేక నగుబాట్లు తెచ్చుకొంటారు • గూడ. కొందరు ఆత్మస్తుతిపరులు. వీళ్ళ నిరంతరం తాము సాధించిన విజయాలను ఏకరువు పెడుతుంటారు. ఈలాంటి క్రియలన్నీ వినయానికి వ్యతిరేకమైనవే.