పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ధైర్యాన్ని సాధించే మార్గాలు

1. జీవితంలో కొందరు చాలా పిరికివాళ్ళు. వీళ్ళు ఏ మంచికార్యాన్ని సాధించడానికీ ముందుకిరారు. చిన్నదానికీ పెద్దదానికీగూడ భయపడిపోయి వెనక్కువెనక్కు పోతుంటారు. మరికొందరు అనాలోచితంగాను మూర్ఖంగాను పనులు ప్రారంభిస్తారు. వీళ్ళకు తొందరపాటు, దుడుకుతనం ఎక్కువ. కనుక తాము ప్రారంభించిన పనులను కొనసాగించలేక నగుబాట్ల తెచ్చుకొంటారు. ఇవిరెండూ అవివేక గుణాలే ఈ దుర్గుణాలను సవరించడానికే పవిత్రాత్మ ధైర్యం అనే పుణ్యం ద్వారా మనలను సక్రమమార్గంలో నడిపిస్తుంది. ఆత్మ మనకు ధృఢత్వమనే వరాన్ని కూడ యిస్తుంది. ఆ వరం ఈ ధైర్యమనే పుణ్యాన్ని బలపరుస్తుంది. కనుక జీవితంలో ధైర్యం చాలనివాళ్లు ఆత్మసహాయంకోసం విశేషంగా ప్రార్థించాలి.

2. ఆధ్యాత్మికరంగంలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించి విజయాలు సాధించినవాళ్ళ తమ్ముతాము నమ్మలేదు. దేవుణ్ణి నమ్మారు. వినయంతో దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. "ఎవడు నాయందు నిలిచివుంటాడో, నే నెవరియందు నిలిచివుంటానో వాడు అధికంగా ఫలిస్తాడు" అన్నాడు ప్రభువు - యోహా 15,5. పౌలుకూడ *నేను ప్రభువు బలాన్ని పొంది అన్ని కార్యాలు చేయగలను" అని వాకొన్నాడు - ఫిలి 4, 13. పైగా ప్రభువు బలవంతులద్వారా గాక దుర్భలులద్వారా మహత్తరకార్యాలు సాధిస్తుంటాడు. "బలవంతులకు సిగ్గు పుట్టించడానికి లోకం దుర్భలులనుగా గణించేవాళ్ళనే ఆయన ఎన్నుకొన్నాడు" -1కొరి 1,27. కనుక మనం అల్పులమైనా సరే దేవుణ్ణినమ్మి అతనిమీద ఆధారపడితే గొప్ప విజయాలు సాధిస్తాం.

3. చాలమంది కష్టాలు వస్తాయని గూడవూహించరు. కనుక బాధలూ సమస్యలూ రాగానే బెండుపడిపోతారు. అధైర్యంతో వాటిని ఎదుర్కోబోతారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం కష్టాలనూ ఇబ్బందులనూ ముందుగానే పసికట్టాలి. ఆపదను ముందుగానే గుర్తుపట్టినవాడు దాన్ని కొంతవరకు గెల్చినవాడౌతాడు.

4. దేవుణ్ణి గాఢంగా ప్రేమించేవాడు అతని కొరకు ఎన్నికష్టాలైనా అనుభవిస్తాడు. అతని సేవలో ఎంత ధైర్యాన్నయినా, ఎంత వోర్పునయినా ప్రదర్శిస్తాడు. ప్రేమ మృత్యువలాగ బలమైంది - పరమగీతం 8,6. ఈ ప్రేమ వలననే వేదసాక్షులు క్రీస్తుకోసం ధైర్యంతో ప్రాణాలర్పించారు. ఈ ప్రేమానుభవం కలవాడు కనుకనే పౌలు "క్రీస్తు ప్రేమ మమ్మ ప్రోత్సాహపరుస్తుంది" అని వాకొన్నాడు – 2కొ 5,14. అతడు క్రీస్తుపట్లగల గాఢమైన ప్రేమవలననే ఎన్నోకష్టాల నెదుర్కొని బోలెడన్ని ప్రేషిత కార్యాలను సాధించాడు. కనుక మనం క్రైస్తవ జీవితంలో ధైర్యాన్ని పెంపొందించుకోవాలంటే ప్రభువుపట్ల గాఢమైన ప్రేమను అలవర్చుకోవాలి.