పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్నో సేవాకార్యక్రమాలు నెలకొల్పాడు, పిరికితనం, పిసినిగొట్టుతనం, దూబరాఖర్చులు చేయడం మొదలైనవి ఔదార్యానికి వ్యతిరేకమైన దుర్గుణాలు.

ఇక, ఓర్పు అంటే సత్కార్యాచరణలో ఎదురయ్యే కష్టాలను దేవుని కొరకు సహనంతో భరించడం. జీవితంలో అందరికీ కష్టాలు ఎదురౌతాయి. చాలమంది అనిష్టంతోను దేవునిమీద తిరుగబడుతూను కష్టాలను అనుభవిస్తారు. దీనివలన ఫలితం లేదు. మనం దేవుని చిత్తానికి లొంగి శ్రమలనుభవించాలి. ఈ పట్టున క్రీస్తు శ్రమలుకూడ మనకు ప్రేరణం కలిగిస్తాయి. దేవునిమీద గొణగుకోకుండా దైవచిత్తానికి తలొగ్గి మన పాలబడిన కష్టాలను అనుభవిస్తే అవి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిపెడతాయి. మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. కష్టాల్లో చివరిదాకా ఓర్పుతో నిలచేవాడే బహుమతిని పొందేది. బాధల్లో నిరుత్సాహం మనలను క్రుంగదీస్తుంది. ఐనా సహనం వలన మనం ప్రాణాలను దక్కించుకొంటాం - లూకా 21,19.

3.బైబులు దృష్టాంతాలు

పూర్వవేదంలో ధైర్యానికీ ఓర్పుకీ పెట్టింది పేరు యోబు. పిశాచం అతని సిరిసంపదలనూ సంతానాన్నీ కడకు ఆరోగ్యాన్ని కూడ అపహరించింది. ఐనా యోబు దేవునిమీద తిరుగబడలేదు. "ప్రభువు తానిచ్చిన వాటిని తానే తీసికొన్నాడు. అతనికి స్తుతి కలుగునుగాక" అన్నాడు, అంతే – 1,21. అంటియోకసురాజు వేదహింసల కాలంలో ధర్మశాస్రాన్ని పాటించినందుకు మక్కబీయుల తల్లి తన యేడురు కుమారులను కోల్పోయింది. కడన తన ప్రాణలనుకూడ బలిగా సమర్పించింది - 2మక్క7.

నూత్నవేదంలో ధైర్యం ఓర్పు మొదలైన గుణాలన్నిటికీ క్రీస్తు మనకు ఆదర్శంగా వుంటాడు. అతడు పుట్టినప్పటినుండి దారిద్ర్యం శ్రమలు హింస మొదలైన యాతనలు అనుభవించాడు. తరువాత యూదనాయకులు అతన్నిఎదరించి అతని కార్యాలకు విఘ్నం కలిగించినా అతడు వెనుకాడలేదు. కడన అతడు నానాయాతనల ననుభవించి సిలువమీద మన పాపాలకొరకు ఆత్మార్పణం చేసికొన్నాడు. విధేయతతోను ప్రేమతోను తన ప్రాణాలను తండ్రికి అర్పించాడు.

క్రీస్తు మనకొరకు బాధలనుభవించి తన అడుగుజాడల్లో నడవటానికి మనకు ఒక ఆదరాన్ని ఏర్పరచాడు -1పేత్రు 2,21. మనం ఆ ప్రభువుతోపాటు బాధలనుభవిస్తే అతనితో పాటు మహిమను పొందుతాం. క్రీస్తుశ్రమలలో పాలుపంచుకోవడం గొప్పభాగ్యం. కనుకనే యెరూషలేములో యూదనాయకులు శిష్యులను కొరడాలతో కొట్టించినపుడు వారు క్రీస్తుకొరకు అవమానాలు పొందడానికి యోగ్యులమయ్యామనుకొని సంతోషించారు - అచ 5,41. పౌలుకూడ "క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదవగా వున్నవానిని నా శ్రమలద్వారా పూర్తి చేస్తున్నాను" అని వాకొన్నాడు — కొలో 1,24.