పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. రహస్యంగావున్న ఇతరుల లోపాలనూ దోషాలనూ అనవసరంగా పదిమందికి వెల్లడి చేస్తుంటావా?
7. నీకు అసూయ వున్న వారిమిూద పుకార్లు పుట్టిస్తుంటావా?
8. నీ వుద్యోగానికి లేక నీవు చేసే పనికి నీకు జీతం లభిస్తుంది. కాని నీవా పనులకు న్యాయం చేకూర్చుతున్నావని చెప్పగలవా?
9. ఇతరుల వస్తువులు దొంగిలించినపుడుగాని, ఇతరుల మంచిపేరు చెడగొట్టినపుడుగాని నష్టపరిహారం చేయాలి అన్న సూత్రాన్ని గమనిస్తుంటావా?
10. నీవు వున్న వాడివైతే, క్రీస్తు ప్రేమసూత్రాలను మనసులో పెట్టుకొని, నీ చుట్టుపక్కలవున్న పేదసాదలను పట్టించుకొంటావా?

3. ధైర్యం

1. దైర్యం అంటే ఏమిటి?

భయానికి వెనుదీయకుండా కష్టమైన ఆధ్యాత్మిక కార్యాలను సాధించడానికి పూనుకోవడమే ధైర్యం. పూర్వకాలంలో వేదబోధ చేయడానికి ఇండియాకు వచ్చిన ఫ్రాన్సిస్ శౌరివారు మొదలైన ప్రేషితులకు ఎంతటి ధైర్యం వుండివుండాలి! ప్రాకృతికమైన ధైర్యం కూడ వుంది. కాని ఇక్కడ మనం చూడబోయేది ఆధ్యాత్మికమైన ధైర్యం. ఈ నైతిక పుణ్యం ఓవైపు భయాన్నీ మరోవైపు దుస్సాహసాన్నీ కూడ అరికడుతుంది.

ఈ పుణ్యంలో రెండు గుణాలున్నాయి. మొదటిది, మనం ఆధ్యాత్మిక రంగంలో కష్టమైన కార్యాలను సాధించడానికి పూనుకొంటాం. వాటినిగూర్చి త్వరగా ఓ నిర్ణయానికి వస్తాం. ఉత్సాహంతో వాటిని సాధించడానికి ఉపక్రమిస్తాం. రెండవది, ఈ కార్యాచరణంలో ఎదురయ్యే ఇబ్బందులనూ బాధలనూ సహిస్తాం. పనికి పూనుకొన్నపుడు గొప్ప ఉత్సాహమే వుండవచ్చు, కాని అవరోధాలు ఎదురయ్యేకొద్ది ఆ ఉత్సాహం కాస్త నశిస్తుంది. కష్టాలు ఎదురయ్యేకొద్ది నిరుత్సాహం పెరుగుతుంది. అప్పుడు ఈ పుణ్యం మనకు బలాన్నిచ్చి మనం నిబ్బరంగా ముందుకి సాగిపోయేలా చేస్తుంది, ఈ పుణ్యమే లేకపోతే మనం కష్టమైన కార్యాలను అసలు చేపట్టనే పట్టం, ఒకవేళ చేపట్టినా, వాటిని మధ్యలోనే ఆపివేస్తాం.

ధైర్యాన్ని పాటించడంలో చాల మెట్లన్నాయి. మొదటిమెట్టు, భయాన్ని జయించడం. కష్టమైన కార్యమనగానే సహజంగానే నరులందరూ భయపడతారు. ఎందుకంటే ఆకార్యంలో అపాయాలూ బాధలూ అపజయాలూ ఎదుర్కోవలసి వుంటుంది. ఐనా ధైర్యగుణం గలవాడు వీటికి జంకడు. ఈ లోక భాగ్యాలకంటె విలువగల ఆధ్యాత్మిక భాగ్యాలున్నాయని అతనికి తెలుసు. ఎంత శ్రమపడైనాసరే ఆ శాశ్వతసౌభాగ్యాలను సంపాదించాలని అతడు కోరుకొంటాడు.