పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4. దురాశను వారించే మార్గాలు



దురాశను జయించాలంటే మనం కొన్ని సత్యాలను జాగ్రత్తగా గుర్తించాలి. మన జీవితాశయం సంపదలుకాదు, భగవంతుడు. కనుక సంపదలను ప్రోగుజేసికొనే రందిలో భగవంతుణ్ణి కోల్పోగూడదు. నరుడు లోకాన్నంతటినీ సంపాదించినా తన ప్రాణాన్ని కోల్పోతే ఏమి లాభం? - మార్కు 8,36.
లోకవస్తువులు మన అవసరాలు తీర్చడానికీ ఇతరులు అవసరాలను తీర్చడానికీగూడ ఉద్దేశింపబడ్డాయి. కనుక మనం వాటిని అమితంగా ప్రోగుజేసికోగూడదు. మన అక్కరలు తీరిన పిదప మిగిలిన వస్తువులను పేదసాదలతో పంచుకోవాలి. కనుక డబ్బున్నవాడు పేదలకు సాయంచేయాలి. ఈ సత్కార్యంద్వారా మనం వస్తుప్రీతినీ వస్తు వ్యామోహాన్నీ అణచుకొంటాం.
మనకు ఈలోక వస్తువులను ఉపయోగించుకొనే హక్కువుందే కాని వాటిమిూద యాజమాన్యం నెరపే హక్కులేదు. కనుక దేవుడు మన చేతిలో పెట్టిన వస్తువులకు మనం ఖచ్చితమైన లెక్క ఒప్పచెప్పాలి. అతడు ఖండితుడైన న్యాయాధిపతి, కావున మనం డబ్బుని దూబరాగా ఖర్చుచేసినా, అక్కరలోవున్న పేదలతో దాన్ని పంచుకోక పోయినా, శిక్ష ననుభవిస్తాం.
మనం పడుతూ ఈ లోకంలోకి సంపదలను తీసికొని రాము. ఇక్కడి నుండి వెళ్ళిపోతూ సంపదల తీసికొనిపోము - 1తిమో 6,7. అవి నశ్వరమైన వస్తువులు. ఈ లోకానికి మాత్రమే చెందినవి. అందుచేత బుద్ధిమంతుడు పరలోకంలో సంపదలు కూడబెట్టుకోవాలి - మత్త 6,19-20. ఏలా? మన సొమ్ములో కొంతభాగం పేదలకు దానంచేయడం ద్వారా, మనం పేదసాదల అక్కరలు తీర్చాలి. పేదల కిచ్చినవాడు దేవునికే అరువిస్తున్నాడు. ఆ బాకీని దేవుడు వడ్డీతో సహ తీరుస్తాడు. నా శిష్యుల్లో అత్యల్పనికి మేలు చేసినవాడు నాకు మేలు చేసినట్లే నన్న ప్రభువు వాక్యం వుండనేవుంది - మత్త 25,40. ఇంకా, మన సొమ్ములో కొంతభాగాన్ని విద్య సాంఘిక సేవ మొదలైన సత్కార్యాలకుగూడ వినియోగించాలి. వీటన్నిటిద్వారా మనం పరలోకంలో సంపదలు కూడబెట్టుకొంటాం. మన ధానధర్మాలు మోక్షంలో నిధులుగా నిలుస్తాయి - మత్త 6,1920. కొంతమంది యెప్పడూ తీసుకోవాలని చూస్తుంటారుగాని ఈయడానికి యెంతమాత్రం వొప్పకోరు. కాని పుచ్చుకోవడం కంటె ఈయడం ధన్యమని గ్రహించాలి - అకా 20,35.

5. ఆత్మ శోధనం



1. నీవు వస్తువ్యామోహం కలవాడివా లేక ఆశను కొంతవరకైనా జయించినవాడివా?
2.లోకవస్తువులు మన ప్రయోజనానికి మాత్రమే కాక ఇతరుల ప్రయోజనానికికూడ సృష్టింపబడ్డాయి అన్న సూత్రాన్ననుసరించి, నీవు నీ యవసరాలను మించి విపరీతంగా వస్తువులు ప్రోగుజేసికోవుగదా?