పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన మోక్షాన్ని మనమే సిద్ధం చేసికొంటాం. అది మనం ఈ లోకంలో చేసే కృషిమీద ఆధారపడి వుంటుంది. ఇక్కడ శ్రమపడి సత్కార్యాలు చేసినవాళ్ళ అక్కడ మహిమ గల సింహాసనాన్ని సిద్ధం చేసికొంటారు. కనుక మన పనిని మనం చక్కగాజేసి ప్రభువుకి అర్పించాలి. అతడు దానికి తగిన బహుమతిని దయచేస్తాడు. ద్రాక్షతోట యజమానుడు చివరిజట్టు కూలీలను జూచి "విూరు దినమంతా పనిపాటలు లేక ఇక్కడ నిలచి వున్నారేమి" అని ప్రశ్నించాడు - మత్త 20,6. ఈనాడు ప్రభువు మనల్ని కూడ ఈలాగే ప్రశ్నిస్తాడు. ఇంకా, శ్రమపడి పనిచేయడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొంటాం, ఉత్తరించే స్థలంలో మనం అనుభవించే బాధలను కొంతవరకైనా తగ్గించుకొంటాం. కనుక మనం ఏ ప్రాదూ కష్టపడి పని చేయాలి. పైగా, మనది పేదదేశం. మనవంతు పని మనం చేసి ఈ దేశాన్ని వృద్ధిలోకి తీసికొని రావాలి. దేశంలో రోజురోజుకీ సోమరితనం పెరిగిపోతూంది. పనిచేసేవాడు దద్దమ్మ, పనిని తప్పించుకొని తిరిగేవాడు తెలివైనవాడు అనే భావాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కాని యివి దుష్టవిలువలు. వీటిని మనం అంగీకరించగూడదు. చాలామందికి ప్రతిఫలాపేక్ష యొక్కువ. ఈలాంటివాళ్ళు తాము చేసేపనికి ఎంత సొమ్ము ముడుతుందా అని మాత్రమే ఆలోచిస్తారు. ఇది స్వార్థబుద్ధి. మనకు సేవాభావం వండాలి. మన కృషివల్ల పదిమంది బాగుపడితే అదే మహాభాగ్యం అనుకోవాలి. మనం చేసే పనిని గూడచక్కగా చేయాలి. కొందరు పై యధికారులు చూస్తుంటే ఏదో కొంత పని చేస్తారు. లేకపోతే లేదు. ఇది వంచన, ఎవడు చూచినా ఎవడు చూడకపోయినా భగవంతుడు మన పనిని చూస్తాడు, మెచ్చుకొంటాడు. కనుక మన పనిని మనం అరకొరలుగా చేయకూడదు. ఏమి చేసినా మనసుపెట్టి చేయాలి. అప్పడు ప్రభువు "ఓయి! నీవు మంచి బంటువి. నీవు స్వల్పకార్యాల్లో శ్రద్ధ చూపించావు కనుక అనేకకార్యాలు నీ కప్పగిస్తాను" అని మనలను మెచ్చుకొంటాడు - మత్త 25,23.

5. ఆత్మ శోధనం

1. నీవు శ్రమపడి పనిచేసేవాడివా లేక వళ్ళ దాచుకొనేవాడివా?
2. నీవు నీ వృత్తికి న్యాయం చేకూర్చుతున్నావని చెప్పగలవా? నీవు అరకొరలుగా, పట్టీపట్టనట్లుగా పనిచేసేవాడివి కాదు గదా?
3. నీవు నీ పనికి సకాలంలో హాజరవుతుంటావా? దానికి వినియోగించవలసినంత కాలం వినియోగిస్తుంటావా?
4. నీవు ప్రతిఫలాపేక్ష యొక్కవా, లేక సేవా భావమెక్కువా?
5. నీవు పై యధికారులు తనిఖీకి వచ్చినపుడూ, లేక వాళ్ళు మెప్ప కోరడానికీ మాత్రమే పనిచేస్తుంటావా లేక చిత్తశుద్ధితో నీ బాధ్యతను నీవు సంతృప్తికరంగా నెరవేరుస్తూంటావా?