పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1కొ6,19, మన శరీరం పవిత్రమైంది. కనుక అశుద్ధ పాపాలతో ఈ శరీరాన్ని అపవిత్రం చేసికోగూడదు. పైగా, మనం జ్ఞానస్నానంద్వారా క్రీస్తు శరీరమౌతాం. అతని దేహంలో అవయవాల మౌతాం - 1కొ 6,15. అలాంటి యీ పవిత్రదేహాన్ని - అది పురుష శరీరమైనా స్త్రీ శరీరమైనా - గౌరవంతో చూడాలి. దాన్ని మోహపాపాలతో కళంకితం చేయకూడదు.

అగస్టీను భక్తుడు తాను పాపజీవితం జీవిస్తున్న తొలిరోజుల్లో కామసంబంధమైన పాపాలను పరిత్యజించ లేమనుకొన్నాడు. పవిత్ర జీవితం జీవించడం అసాధ్యమనుకొన్నాడు. కాని అతడు జ్ఞానస్నానం పొందాక, దైవకృపచేత అలాంటి జీవితం జీవించడం సాధ్యమేనని గ్రహించాడు. కనుక ప్రతి వొక్కడూ, తాను కోరుకొంటేచాలు, నిర్మల జీవితం జీవించవచ్చు దేవద్రవ్యానుమానాలూ ప్రార్థనా ఇందుకు తోడ్పడతాయి.

జీవితంలో మోహపాపాలను ప్రేరేపించే పరిస్థితులు తటస్థపడుతుంటాయి. ఈ పరిస్థితులనుండి మనం జాగ్రత్తగా తప్పకొంటూండాలి. గాలం దగ్గరికి వచ్చిన చేప గాలానికి తగులుకొంటుంది. గాలానికి దూరంగా తొలగిపోయేది తప్పించుకొంటుంది. దొంగతనం మొదలైన పాపాలు చేద్దామనే శోధనలు వచ్చినపుడు మనం ఆ శోధనతో పోరాడాలి. కాని మోహపాపాలు చేద్దామనే శోధనలు వచ్చినపుడు వానితో పోరాడకూడదు. వాని నుండి పారిపోవాలి. లేకపోతే మన యీ జంతుదేహం కామావేశానికి గురై ఉద్రేకం చెందుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఇది బాగా ఉపయోగపడే సూత్రం, పైగా, నేటి యుగం లైంగికయుగం. లోకం మనలను లైంగిక సుఖాల ననుభవించమని శతవిధాల ప్రోత్సహిస్తుంది. ఎటుమళ్ళినా లైంగిక దృశ్యాలను చూపిస్తుంది. లైంగిక విలువలే నిజమైన విలువలని చాటిచెప్తుంది. ఈలాంటి వాతావరణంలో ఎంతో చిత్తశుద్ధి కలవాళ్ళేగాని లైంగిక ప్రలోభాలకు తట్టుకొని నిలువలేరు.

తరచుగా మనం క్రియాపూర్వకంగా చేసినవి మాత్రమే పాపాలనుకొంటాం. హృదయాలలోని ఆశలుకూడ పాపాలేనని గ్రహించం. శారీరక వ్యభిచారంతోపాటు మానసిక వ్యభిచారం కూడ వుంది. "కామేచ్ఛతో పరస్త్రీవైపు చూస్తే ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే" - మత్త 5,28.

ఈ సందర్భంలో నేత్రవినీతి ఎంతో అవసరం. మనకండ్లు మన ఆత్మకు కిటికీల్లాంటివి. వాటిగుండా మంచి భావాలుగాని చెద్ద భావాలుగాని మన ఆత్మలోకి ప్రవేశిస్తాయి. కనుక మనం గొంతెమ్మ కోరికలు కోరుకొంటూ దారినపోయే వారి నందరినీ చూస్తూంటే చెడుకోరికలను కొనితెచ్చుకొన్నట్లవుతుంది. లైంగిక రంగంలో స్పర్శకూడ చాల ప్రమాదకరమైంది. అసలు లైంగిక సుఖమంతా స్పర్శలోనే వుంటుంది. కనుక దురుద్దేశంతో పరస్త్రీ లేక పర పురుషుని శరీరాన్ని ఎంతమాత్రం ముట్టుకోకూడదు. ఇంకా, మోహాలోచనలను మనసులోనికి రానీయకూడదు, వాటిని మనసులో నిలవనీయకూడదు.