పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరకు పనిచేస్తాం. దేవుని కొరకు జీవిస్తాం. భగవంతుని మహిమమకొరకే అన్నంకూడ తింటాం.

ప్రభువు తండ్రిలాంటివాడు. తన బిడ్డలమైన మనకు అనుదినాహారాన్ని దయచేస్తాడు. కనుక అతనికి కృతజ్ఞత జూపుతూ మన రోజువారి అన్నాన్ని భుజించాలి. నిజం చెప్పాలంటే, పాపులమైన మనం అనుదినాహారానికి కూడ అరులంకాము. కనుక చాల వినయంతో దేవుడు మనకు దయచేసిన ఆహారాన్ని పుచ్చుకోవాలి. ఈ యన్నం వలన మనం పుష్టిచెంది దేవుణ్ణి తోడిప్రజలనూ సేవించడానికి శక్తిని పొందుతాం. కనుక భగవంతుణ్ణి నరులనూ ప్రేమభావంతో సేవిద్దామనే ఉద్దేశంతో అన్నం తినాలి.

మనం అన్నం తినడానికి జీవించకూడదు. ఇది తిండిపోతుల లక్షణం. జీవించడానికి తినాలి. ఇది సంయమనం కలవాళ్ళ లక్షణం. తమిళ కవి తిరువళ్ళువర్ "ముందు తిన్నది అరిగిందాక మళ్ళా తిననివాడికి ఏమందూ అక్కరలేదు" అన్నాడు. కనుక అతిగా తిని రోగాలు తెచ్చుకోగూడదు. ఎరుగక తిని అరుగక చస్తిని అన్నట్లుగా బాధపడకూడదు.

కొన్నిసారులు బుద్ధిపూర్వకంగానే మనకిష్టమైన భోజనపదార్థాలను తినడం మానుకోవడం మంచిది. కడుపునిండా తినకుండా కొంచెం ఆకలితో లేవడంకూడ వంటికి మంచిది. ఈలాంటి కార్యాలద్వారా ఈ జంతుదేహం మన అదుపులోకి వస్తుంది, ఇంద్రియాలను మన చెప్పచేతల్లో వుంచుకొంటాం. అన్నమదమే అన్నిమదాలకు కారణమని చెప్తుంది ఓ తెలుగుసామెత. కనుక ఈ యన్నమదాన్ని కొంచెం తగ్గించుకొంటే మంచిది.

భోజనానికీ భోజనానికి మధ్య చిరుతిండ్లు పనికిరావు. దీనివల్ల ఆకలి చెడుతుంది. భోజనానికి ముందూ భోజనం ముగిసిన తర్వాతగూడ చిన్న ప్రార్థన చెప్పకోవడం మంచిది.

మత్తుపానీయాలు సేవించడం మన దేశాచారం కాదు. తాహతుకు మించి వీటిని సేవించేవాళ్ళు ఇలూ వళ్ళూ గుల్ల చేసికొంటారు. భార్యాబిడ్డలను ఇరకాటాన బెడతారు, కనుక బుద్ధిమంతుడైనవాడు అసలు వీటిని ముట్టుకోగూడదు.

5. ఆత్మ శోధనం

1. నీవు తిండిపోతువా లేక మితభోజనాన్ని పాటించేవాడివా?
2. నీవు ఒక్కప్రాదు, మాంస నిషేధం మొదలైన ఉపవాస నియమాలను పాటిస్తూంటావా?
3. కడుపు నిండినా కడ్లు నిండవు అనే సామెత నీకు నర్తిస్తుందా? .
4. నీవు విూ యింటిలో వండిన కూరలకు తరచుగా వంకలు పెడుతూ ఆడవాళ్ళమీద సుమ్మర్లు పడుతూంటావా?