పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ఆత్మ పవిత్రుడైన వ్యక్తి జీవనదాత. అతడు లేందే అంతా శూన్యం. అంతా నిస్సారం. ఆత్మ లేకపోతే శరీరం పాపమూ మృత్యువూ మాత్రమే. ఆత్మ లేకపోతే మోషే ధర్మశాస్త్రం మృత్యుదాయిని మాత్రమే - 2కొరి 3,6.

5. దేవుడూ ఆత్మాకూడ పరాత్పరులు, నరునికి దూరంగా వుండేవాళ్ళ.కాని ఆత్మడు సృష్టి ప్రాణులకు దూరంగావున్నా వారికి చేరువగాగూడ వుంటాడు, అతడు స్వర్గంలో వుండేవాడైనా నరుల దగ్గరికి వచ్చి వారికి దివ్యత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మడు మనలను పవిత్రపరుస్తాడు - 2తెస్స 2,18.జ్ఞానస్నానంద్వారా మనలో ఓ దేవాలయంలోలాగ వసిస్తాడు. కనుకనే పౌలు “మీ శరీరం మీయందు వసించే పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా" అన్నాడు. - 1కొ 6,19. ఆత్మద్వారా మనం ఆధ్యాత్మిక దేవాలయంలో సజీవ శిలలమౌతాం, పవిత్రులమైన యాజకులం, రాచరికపు గురుకులం, పవిత్రమైన జనం, దేవుని సొంత ప్రజ ఔతాం - 1పేత్రు 2,5.9. కనుక ఆత్మ వలన మనం పరిశుద్దులమౌతాం, అతనిద్వారా క్రీస్తుకి పవిత్ర వధువుగాగూడ తయారౌతాం - ఎఫే 5,26-27. శ్రీసభ క్రీస్తు వధువు. కాని ప్రతి ఆత్మా ప్రతిక్రైస్తవుడూ శ్రీసభలాంటివాడే.

భగవంతుడు స్వయంగానే పరిశుదుడు. కాని సృష్టి ప్రాణులమ్తేన మనం స్వయంగాగాక దేవునికి సమర్పితులం గావడంద్వారా పవిత్రులమౌతాం. కనుకనే క్రీస్తుకూడ తన్ను తాను దేవునికి ప్రతిష్టించుకొన్నాడు - యోహా 17,19.

ప్రార్థనా భావాలు

1. అల్బర్ట్ భక్తుడు ఈలా చెప్పాడు "ఆత్మడు శ్రీసభను నిత్యం పవిత్రపరుస్తుంటాడు. వరప్రసాదాల ద్వారా, దేవద్రవ్యానుమానాలద్వారా, పుణ్యాలు వరాలద్వారా, అద్భుతాలద్వారా అతడు ఈ పవిత్రీకరణ కార్యాన్ని కొనసాగించుకొంటూ పోతాడు". మన తరపున మనంగూడ, మనలను పవిత్రపరచమని ఆత్మను నిరంతరం అడుగుకొంటూండాలి.

2. ఆత్మడు పవిత్రత్రీత్వంనుండి బయలుదేరే దివ్యవ్యక్తుల్లో కడపటివాడు. కనుక అతనికి త్రీత్వంలో సఫలత్వం ఏమీలేదు, అతని సఫలత్వం త్రీత్వానికి వెలుపలనే వుంటుంది. క్రీస్తు మనుష్యావతారంలోను, నరులమైన మన పవిత్రీకరణంలోను అతని సఫలత్వం బాగా కన్పిస్తుంది. ఈ యాత్మ వలన మనం అధికాధికంగా పవిత్రులమౌతూండాలి. పైగా మనం ఎంతగా పాపంనుండి వైదొలగుతామో అంతగా పవిత్రాత్మకు బిడ్డలమౌతాం.