పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐనా పూర్ణగర్వాత్మలు అరుదు. మనబోటి వాళ్ళందరిలో మదం ఒక మోస్తరుగా వుంటుంది. మనం దేవుణ్ణి అంగీకరిస్తాం. అతడు మనకు సృష్టికర్త అనీ, మనం చేరవలసినతీరం అనీ ఒప్పకొంటాం. కాని అతనికి చెందవలసిన కీర్తి మహిమలను మాత్రం మనకు ఆరోపించుకొంటాం. ఈలాంటి గర్వం తరచుగా స్వల్పపాప మౌతుంది.

గర్వం వలన ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయి. భగవంతుడు గర్వాత్ముణ్ణి అసహ్యించుకొంటాడు. అతనికి తన వరప్రసాదాలు ఈయడు. “దేవుడు అహంకారులను ఎదిరించి వినములకు తన కృపను దయచేస్తాడు" - యాకో 4,6. అహంభావం కలవాళ్ళు తరచుగా ఇతరుల పొగడ్తల కోసం తమ కార్యాలు చేస్తారు. దానివల్లకూడ వాళ్ళు వరప్రసాదాన్ని కోల్పోతారు. "పదుగురికంటబడ్డానికై విూరు మీ మతకర్మల్ని బహిరంగంగా చేయవదు. అలాచేస్తే పరలోకంలోని మీ పితనుండి ఏలాంటి బహుమానమూ పొందలేరు" - మత్త 6,1. ఇంకా గర్వాత్మలు తోడిజనాన్ని అనాదరం జేస్తారు, విమర్శిస్తారు. అణచివేస్తారు. కనుక సోదరప్రేమను భగ్నం జేస్తారు. దీనివల్ల వైరమూ ద్వేషమూ తగాదాలూ పెరుగుతాయి. పైపెచ్చు గర్వితులు మనశ్శాంతిని కోల్పోతారు. వాళ్ళు ఇతరులను ఓడించి తాము అందరికంటె పై చేయిగా వుండాలని కోరుకొంటారు. కాని తాము అనుకొన్నంత సులభంగా యితరులను ఓడించలేరు. అందువల్ల నిరుత్సాహనికీ మానసిక వ్యధకూ గురౌతుంటారు. ఈలా గర్వం వలన కలిగే అనర్దాలు చాలా వున్నాయి.

అహంకారమంటే నరుడు తన్నుతాను పూజించుకొనడం, తనకు తాను దేవుడు కావడం. దీనిని బట్టే గర్వంలో ఎంత దుష్టత్వముందో ఊహించుకోవచ్చు.

4. బైబులు దృష్టాంతాలు

1. గర్వానికి మొదటి ఉదాహరణం ఆదామే. అతడు నరమాత్రుడై యుండికూడ తాను దేవుడు కావాలని కోరుకొన్నాడు - ఆది 3,5. ఈ పాపానికి పరిహారం చేయడానికే క్రీస్తు తన దైవత్వాన్ని వదులుకొనేటంతగా వినయవంతుడయ్యాడు - ఫిలి 2,6-8.

2. ఐగుపరాజు ఫరో అహంకారానికి పెట్టింది పేరు. మోషే ఫరోతో నీవు మా జనాన్ని పంపివేయాలి. ఇది మా దేవుడైన యావే ఆదేశం అని చెప్పాడు. ఆ మాటకు ఫరో మండిపడి ఎవడా యావే? అతడు చెప్పినట్లుగా నేనెందుకు విూ జనాన్ని పంపాలి అన్నాడు — నిర్గ 5,1-2.

3. ఆదిమానవులు అహంకారంతో ఆకాశాన్నంటే గోపురం కట్టి కీర్తి తెచ్చుకోవాలి అనుకొన్నారు. కాని దేవుడు వాళ్ళ భాషను తారుమారుచేసి వాళ్ళకు బుద్ధి చెప్పాడు - ఆది 11, 4.