పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలాంటి ఆత్మపట్ల మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుండాలి. ఈయాత్మను తల్లిలా గౌరవిస్తుండాలి. ఈపవిత్రాత్మను ఎప్పడూ దుఃఖపెట్టకూడదు - ఎఫే 4, 30. పాపం చేసినపుడెల్ల ఈయాత్మను హృదయంలో నుండి గెంటివేస్తుంటాం, పిశాచానికి హృదయంలో ప్రవేశం కలిగిస్తుంటాం. ఈలా తన విరోధికి స్థానమిచ్చి తన్ను ఇంటిలోనుండి తరిమివేసిన అవివేకపు బిడ్డలనుజూచి ఈయాత్మ తల్లిలా బాధపడుతుంది. దుఃఖిస్తుంది. పైగా తాను పవిత్రాత్మ కావున, అపవిత్రమైన పిశాచాన్ని పాపాన్ని ఎంతమాత్రం సహింపలేదు.

ఇంకా హృదయంలోని ఆత్మను ఆర్పివేయకూడదు - 1 తెస్స 5,19. ఆత్మ మన అంతరాత్మలో వెలుగులా ప్రకాశిస్తుంది అన్నాం. మనం ఏపని చేయాలో ఏపని మానుకోవాలో తెలియజేస్తుంది అన్నాం. కాని మనం అంతరాత్మ ప్రకారం ప్రవర్తించనపుడెల్ల బుద్ధిపూర్వకంగా చెడుత్రోవలు తొక్కినపుడెల్ల హృదయంలో వెలిగే యిూ వెలుగును ఆర్చివేస్తుంటాం. గృహిణి దీపాన్ని ఆర్పివేసినట్లుగా, హృదయంలోని ఈ దీపాన్ని గుప్పన ఆర్చివేస్తుంటాం. ఇంతకన్న అవివేకం మరొకటుండదు.

ఈలా హృదయంలోని ఆత్మను ఆర్చివేసినవాళ్ళ ఆత్మలో నెలకొనివున్న ఆత్మను దుఃఖపెట్టి వెళ్లగొట్టినవాళ్లు, తల్లిలేని బిడ్డల్లా చెడిపోతారు. తల్లిలేని పిల్లలు దిక్కుమొక్కులేక బావురుమంటుంటారు. ఆత్మనుపోగొట్టుకున్న క్రైస్తవులూ ఆధ్యాత్మిక జీవితం జీవింపలేక అలమటించి కృశించి నశించిపోతారు. ఈ దీనావస్థ మనకు ప్రాప్తించకుండా వుండాలని ఆయాత్మనే మనవి చేసుకుందాం.

3. పరిశుద్ధాత్మ సహవాసం - 2 కొ 13,14

"పరిశుద్ధాత్మ సహవాసం మీతో వుండాలి" అని దీవిస్తూ రెండవ కొరింతీయుల జాబును ముగించాడు పౌలు. క్రీస్తు జీవించినపుడు శిష్యులంతా ప్రభువుతో కూడిమాడి జీవించారు. వాళ్లంతా ఓ చిన్న సమాజంగా ఏర్పడ్డారు. ఇక, క్రీస్తు ఉత్తాన అనంతరం వేంచేసివచ్చిన ఆత్మ ఈ సమాజం విచ్చినమై పోకుండా కాపాడింది. రోజురోజుకు ఈ సామాజాన్ని వృద్ధిచేస్తువచ్చింది. ఈలా వృద్ధిపొందిన సమాజమే నేటి తిరుసభ.

పరిశుద్దాత్మ మనతోను మనం పరిశుద్దాత్మతోను వసిసూవుండడంవల్లనే వృద్ధిచెందుతూన్నాం. క్రైస్తవులమైన మనమందరం ఐక్యభావంతో జీవింపగలుగుతూన్నాం, ఒకరినొకరం అంగీకరించి ఆదరించి ప్రేమింపగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ సహవాసమంటె యిదే.