పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంట పొలాల్లో ముందుగా పండిన వెన్నులు ఫలాలు మొదలైన వాటిని, మందలలో మొదట పుట్టిన పిల్లలను యూదులు యెరూషలేం దేవాలయంలో కానుక పెట్టేవాళ్ళు. దీని ద్వారా ఆ పంటా మందలూ పూర్తిగా యావేకు చెందినవనీ యావేకు లభింపవలసినవనీ సూచించబడింది. పైగా కానుకగా అర్పింపబడిన యీ బలివస్తువులు పూర్తి పంటను పూర్తి మందలను పవిత్రం చేస్తాయనిగూడ సాంకేతికంగా తెలుపబడింది.

ఇక, “తొలిఫలాలు" "సంచకరువు" అనే యూ రెండు శబ్దాలను పవిత్రాత్మకు నామాలుగా వాడాడు పౌలు. అతని ఉద్దేశం యిది. మనం పరలోకపు తండ్రి బిడ్డలం. ఆ తండ్రి మోక్షం మనకు వారసభూమి. ఈ వారసాన్ని ఈ జీవితంలోనే కొంతవరకు అనుభవిస్తాం. ఉత్దానం తరువాత పూర్తిగా అనుభవిస్తాం. ఇట్లు మోక్షాన్ని పూర్తిగా పొందుతాం అనడానికి నిదర్శనంగా, పరిశుద్దాత్మ మనకు బయానాగాను, తొలిఫలాలుగాను ఈయబడింది. కావున ఈ యాత్మ ద్వారానే మనకు మోక్షం లభిస్తుంది.

పరిశుద్దాత్మ అనే వో గొప్ప నిధి మన హృదయంలోనే గుప్తమై వుంది. ఈ నిధిని గుర్తించి సద్వినియోగం చేసికుందాం.

28. క్రీస్తు రూపం

ఆత్మ మన తరపున ఇన్ని మంచి పనులు చేస్తుంది అన్నాం. కాని వీటన్నిటినీ ఒకే పనిగా భావించవచ్చు. క్రీస్తుకు మనకు సంబంధం కలిగించడం, క్రీస్తు వైపునకు మనలను ఆకర్షించడం - ఇదీ ఆత్మ చేసేపని.

ప్రభువు మోక్షానికి ఆరోహణంచేసి వెళ్లిపోయాక ఈ భూమిమీద ప్రభువు ప్రారంభించిన పనిని కొనసాగించుకుంటూ పోయేది పవిత్రాత్మ. కావుననే ప్రభువు వెళ్లిపోయాక ఆత్మ వేంచేసి వచ్చింది. ప్రభుస్థానాన్ని పొందింది. ఇక, మనలను క్రీస్తువైపు ఆకర్షించడంద్వారా ఆత్మ ప్రభుకార్యాన్ని కొనసాగిస్తుంది. ఈయాత్మ సహాయం లేందే క్రీస్తును విశ్వసించలేం. అసలు "యేసు” అనే పేరుకూడ ఉచ్చరించలేం - 1కొ 12, 3.

క్రీస్తు మరణం ఉత్దానం, పాపపరిహారం, రక్షణం - ఇది పిత సంకల్పించుకున్న రక్షణ ప్రణాళిక. దీన్నే “రహస్యం” లేక "మర్మం" అని పిలుస్తుంటాడు పౌలు. ఇక, పిత నిర్ణయించుకున్న రక్షణ ప్రణాళికను, అనగా క్రీస్తు మరడోత్థానాలను మనంతట మనం అర్థంచేసికోలేం. మనంతట మనం క్రీస్తును ప్రేమింపలేం. పరిశుద్ధాత్మ మన హృదయంమీద పనిచేసి మనం క్రీస్తు మరణియత్దానాలను అర్థంచేసికునేలా చేస్తుంది - 1కొ2, 13-15. కనుక ఈ యాత్మ సహాయం లేందే మనం క్రైస్తవులం గాలేం, క్రైస్తవుల్లా జీవించలేం, క్రీస్తును అనుసరించలేం.