పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిష్యులు ఓమారు ప్రార్థించే విధానం నేర్పమని క్రీస్తునడిగారు. ప్రభువు వాళ్లకు పరలోకజపం నేర్పించాడు. ప్రభువు నేడు మన మధ్యలోలేడు. క్రీస్తు వెళ్లిపోయాక క్రీస్తుస్థానాన్ని పొందింది పరిశుద్ధాత్మ కనుక ఆ శిష్యుల్లాగే మనం కూడ ప్రార్థించే విధానం నేర్పమని ఈ యాత్మను అడుక్కుంటూ వుండాలి.

ఉత్థానక్రీస్తు మోక్షంలో పితయెదుట మనకోసం ప్రార్థన చేస్తూవుంటాడు - హెన్రీ 7,25. క్రీస్తు మోక్షంలో ప్రార్ధనచేస్తూ వుంటే, ఆత్మయిక్కడే మనహృదయంలోనే ప్రార్ధిస్తూవుంటుంది. కావున క్రైస్తవ భక్తుడు ఈ యాత్మతో కలసి, ఈ యాత్మ సహాయంతో ప్రార్థన చేసికుంటూ వుండాలి.

24. ఉత్థానభాగ్యం ప్రసాదిస్తుంది - రోమ 8, 11.

పిత పవిత్రాత్మద్వారా ప్రభువును ఉత్తానంతో లేపాడు. క్రీస్తు మృతదేహంలోనికి ఆత్మ ప్రవేశించి చైతన్యం కలిగించింది. ఆ చైతన్యంతోనే క్రీస్తు ఉత్తానమయ్యాడు. క్రీస్తును ఉత్తానంతో లేపిన ఆత్మేమనకు గూడ ఉత్తానభాగ్యం అనుగ్రహిస్తుంది. భూమిలో పడిన బీజం నశించిపోదు. మళ్లా మొలకెత్తి చెట్టుగా ఎదుగుతుంది. ఆలాగే భూమిలో పాతిపెట్టబడిన మానుష దేహంగూడ నశించిపోదు. కడపటి దినాన ఆత్మశక్తిద్వారా మల్లా ఉత్తానమౌతుంది. ఆయాత్మ మన మృత దేహంలోనికి ప్రవేశించి మనకూచైతన్యం కలిగిస్తుంది.

యూదుల వారసభూమి పాలస్తీనాదేశం,మన వారసభూమి మోక్షం. మోక్షానికి మనలను వారసులుగా జేసేది, మోక్షంలో మనం ప్రవేశించేలా చేసేది ఆయాత్మే - ఎఫే 1, 14. మోక్షం మన తండ్రి రాజ్యం, బిడ్డలమైన మనం ఈ రాజ్యంలో ప్రవేశించాలి. ఏయాత్మద్వార మనం దేవుని బిడ్డలమౌతామో ఆయాత్మ ద్వారానే మోక్షంలో ప్రవేశించే అర్హతను గూడ పొందుతాం.

ఈ దేహం మల్లా ఓనాడు ఉత్తానమై ప్రభుసన్నిధిలో నిలుస్తుంది. ఆలాంటి ఈ మానుష దేహాన్ని - అది స్త్రీ దేహమైనా సరే పురుష దేహమైనాసరే - పవిత్ర భావంతో చూస్తుండాలి. ఈ పావిత్ర్యాన్ని ప్రసాదించమని కూడ ఆ యాత్మనే అడుగుకుందాం.

25. జీవించే ప్రాణి - జీవమిచ్చే ప్రాణి - 1కొ 15, 45.

సృష్టి జరిగినప్పడు ప్రభువు ఓ పిడికెడు మట్టి మద్దను తీసికొని దానిలోనికి శ్వాస ఊదాడు. వెంటనే ఆ మట్టిముద్ద జీవించే ప్రాణి బంది. ఆ ప్రాణే తొలి మానవుడు, ఆదాము. మళ్ళా యావే ప్రభువు క్రీస్తు మృత దేహంలోనికిగూడ శ్వాసను ఊదాడు.