పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19. నరునకు నరుడు తోడేలు

"మానవుడు మానవుణ్ణి తోడేలులాగ కబళించివేస్తాడు” అంటుంది ఓ రోమను సామెత. కాని ఈయాత్మ ప్రభావంవల్ల నరుడు నరుణ్ణి ప్రేమిస్తున్నాడు, సేవిస్తున్నాడుకూడ - గల 5, 13. అందుకే దేహానికి ఆత్మ యేలాంటిదో క్రైస్తవ సమాజానికి పరిశుద్దాత్మ ఆలాంటిది అన్నారు పితృపాదులు. శరీరంలోని అవయవాలను ఒక్కటిగా బంధించి దేహం పెంపొందేలా చేసేది మన ఆత్మ ఆలాగే క్రైస్తవ ప్రజలను ఒక్కటిగా ఐక్యపరచి పరస్పర ప్రేమభావంతో పెంపునకు గొనివచ్చేది పవిత్రాత్మ క్రైస్తవ ప్రజలు ఏదేశంవాళ్ల్తెన, ఏ కాలంవాళ్ల్తెన, ఏవర్గం వాళ్ల్తెన ఒకరికొకరు ప్రియపడుతూనే వుంటారంటే, అది ఈ యాత్మ అనుగ్రహమే. ఈ యాత్మ క్రైస్తవ ప్రజలను ఓ సమాజంగాను ఓ దేవాలయంగాను నిర్మించుకుంటూ పోతుంది - ఎఫే 2, 22.

క్రైస్తవ జీవితానికి ప్రాణంవంటిది ప్రేమశక్తి. ఈశక్తిని పవిత్రాత్మ మనకూ అనుగ్రహిస్తుండాలని ప్రార్థిద్దాం.

20. అంతరాత్మను ప్రబోధిస్తుంది - రోమ 9,3.

పూర్వవేదపు యూదులు రాతిపలక మీద వ్రాయబడిన పదియాజ్ఞల ప్రకారం జీవించేవాళ్ళు. కాని నూతవేద ప్రజలమైన మనం మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవింపం. పవిత్రాత్మ పలకకు మారుగా మన హృదయంమీద, పదియాజ్ఞలకు మారుగా ప్రేమాజ్ఞను వ్రాస్తుంది. ఇది క్రొత్తయాజ్ఞ. మనమంతా ఈ క్రొత్తయాజ్ఞ ప్రకారం జీవిస్తాం - హెబ్రే 8,10.

ఈ యాత్మ మన అంతరాత్మను ప్రబోధిస్తుంది. ఈ ప్రబోధం ప్రకారం నడచుకుంటే చాలు పరిశుద్దల మౌతాం. జీవితంలో రకరకాల గడ్డ సమస్యలు ఎదురుపడుతుంటాయి. త్రోవ తిన్నగా కనిపింపదు. ఐనా ఈ సమస్యలను గూర్చి ఓ నిర్ణయానికి వస్తుండాలి. ఏలాగ? పరిశుద్దాత్మ సహాయం ద్వారానే. ఈ యాత్మ మన యాత్మకు వెలుగును అనుగ్రహిస్తుంది. మనం మంచి నిర్ణయాలు చేసికొని దైవచిత్తం ప్రకారం జీవితాన్ని కొనసాగించుకునేలా సహాయపడుతుంది. అందుకే నూత్నవేదం పెక్కుతావుల్లో ఈ యాత్మను "వెలుగు" అని పిలుస్తుంది - హెబ్రే 6,4. పునీతులు ఈ యాత్మ ప్రబోధం విన్నారు, ఈయాత్మచూపించే వెలుగుబాటలో నడచిపోయారు.

పరిశుద్దాత్మ మన అంతరాత్మతో తిన్నగా మాటలాడుతూందిగూడ. మనం ఆయాత్మస్వరాన్ని వినే అలవాటు కలిగించు కోవాలి. ఆయాత్మ ప్రబోధాలను పెడచెవిని పెట్టకుండా వుండేలా చూస్తుండాలి. మహానుభావులు పోప్ జాన్ మొదలైనవాళ్లు హృదయంలో వినిపించే ఆత్మ స్వరాన్ని ఆలిస్తూ వుండేవాళ్లని వింటున్నాం.