పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వారా క్రైస్తవ జీవితం పటిష్టమౌతుంది. కనుక ఆత్మ ఈ భాగ్యాలన్నీ మనకు కరుణించాలని వేడుకుందాం.

17. ఓ దేవాలయంగా మారిపోతాం - 1కా 6, 19, 3, 17

జ్ఞానస్నాన సమయంనుండి ఆత్మ మనహృదయంలో వసిస్తుంది అన్నాం. ఆలా వసించి మనలను తన ఆలయంగా తయారు చేసికుంటుంది, పవిత్ర పరస్తుంది. పరిశుద్ధాత్మ మనలను మూడురూపాల్లో పవిత్ర పరస్తుంది : 1) మనలను దేవుని ఆరాధనకు అంకితం చేస్తుంది. దీనిద్వారా దేవుని పరిచారకులమౌతాం. దేవుని పూజిస్తాం - ఫిలి 3.3. 2) యెరూషలేం దేవాలయంలో నిర్మలమైన గొర్రెపిల్లలను బలిగా సమర్పించేవాళ్లు ఈ యాత్మ మనలనుగూడ మచ్చలేని గొర్రెపిల్లల్లాగ తీర్చిదిద్దుతుంది, ప్రభువునకు బలిగా సమర్పిస్తుంది - రోమ 15, 16, 3) మనలను ప్రభువు రెండవ రాకడకు సిద్ధం చేస్తుంది. ప్రభువు రాకడకు మనం వేచివుండేలా చేస్తుంది. అప్పటిదాకాగూడ పాపంవలన నాశమై పోకుండా వుండేలా కాపాడుతుంది- 1 తెస్చ 5, 19-23.

ఇన్నివిధాల ఆత్మ మనలను పవిత్రపరుస్తుంది. దైవ వ్యక్తులు ముగ్గురున్నాగానీ, పవిత్రీకరణం మాత్రం విశేషంగా పరిశుద్దాత్మకే ఆరోపింపబడుతుంది. ఈ ఆత్మద్వార మనం రోజురోజుకి పవిత్రులమౌతూండాలి.

18. ప్రేమవరం - రోమ 5,5.

ఈ యాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి కుమ్మరింపబడుతుంది. పవిత్రాత్మమూడురూపాల్లో మనకు ప్రేమవరాన్నిఅందిస్తుంది: 1) మొట్టమొదట క్రీస్తుద్వారా పిత మనలను ప్రేమించాడు - రోమ 8, 39. పిత మనపట్లచూపే యీ యపార ప్రేమను అర్థంచేసికునేలా చేస్తుంది ఈ యాత్మ. ఆ పిమ్మట మన ప్రేమను పితకు అర్పిస్తుంది. 2) "ఆయాత్మ వచ్చినపుడు మీకు సంపూర్ణ సత్యాన్ని బోధిస్తుంది" అంటాడు ప్రభువు - యోహా 16, 13. ఈ సంపూర్ణ సత్యం మరేమో గాదు, క్రీస్తే. అనగా మనం క్రీస్తును అర్థంచేసికునేలా, క్రీస్తు ప్రేమను గ్రహించేలా చేసేది ఈ యాత్మె. ఈయాత్మ సహాయంవల్లనే క్రీస్తు సిలువమరణాన్ని రక్షణాన్ని అర్థంచేసికుంటున్నాం, అంగీకరిస్తున్నాం. ఇక మనం క్రీస్తుపట్ల బదులు ప్రేమ చూపేలా చేసేదికూడ ఈ యాత్మే. క్రీస్తును ప్రేమించమని పరిశుద్ధాత్మ మనలను నిర్బంధిస్తుంది - 2కొ 5, 14. 3) ఇక, పిత సుతులను ప్రేమించినట్లే తోడి ప్రజలనుగూడ ప్రేమించేలా చేసేదీ ఈ యాత్మమే - ఎఫే 5, 1-2. ఈ యాత్మ ప్రసాదించే ప్రేమవరం వల్లనే మనమంతా ఒకరినొకరం అంగీకరిస్తున్నాం, ఆదరిస్తున్నాం, ఒకరి భారాన్నొకరు భరించుకుంటూ పోతున్నాం - గల 6,2.