పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్తుతించి పూజిస్తాం. "ప్రభువు మహాదేవుడు, ఆయన అత్యధికంగా పూజింపదగినవాడు" అంటాం - కీర్త 145,3. ఈ కారణంచేత ప్రార్థనలన్నిటిలోను స్తుతి ప్రార్ధనం శ్రేష్టమైంది.

3. కొందరు ఎప్పుడూ మనవి ప్రార్ధనం చేస్తూంటారు. అదీయమనీ ఇదీయమని దేవుణ్ణి అడుగుతుంటారు. కాని ఆ ప్రభువు మాహాత్యాన్ని అర్థం చేసికొని అతన్ని ఆరాధించనే ఆరాధించరు. ఈలాంటివాళ్లు అనతికాలంలోనే స్వార్థపరులైపోతారు. ఈ సత్యాన్ని గుర్తించి పెంతెకోస్తు ఉద్యమం స్తుతి ప్రార్థనను ప్రోత్సహిస్తుంది. ఈ వుద్యమం భక్తులు బృందాలుగా కూడి ఉత్సాహంతో ప్రభుని స్తుతించి గానం చేస్తూంటారు. ఈలాంటి స్తుతి ప్రార్ధనం వలననే ఆత్మ నుండి మనకు సేవా వరాలు లభిస్తాయి. విశేషంగా మనం సోదరప్రేమలో వృద్ధిచెందుతాం.

4. స్తుతించడం అంటే ఆశ్చర్యపడ్డం, మెచ్చుకోవడం తన్మయత్వం చెందడం. ఈ స్తుతిభావాలను చప్పట్ల కొట్టడం ద్వారా, చేతులు పైకెత్తడం ద్వారా నినాదాలు చేయడం ద్వారా, పాటలు పాడ్డం ద్వారా వ్యక్తం చేస్తాం. కనుకనే కీర్తనకారుడు "సర్వజనులారా! చప్పట్ల కొట్టండి, జయజయ ధ్వానాలతో ప్రభుని గూర్చి నినాదాలు చేయండి, యావేను కీర్తించండి" అంటాడు - 47,1. “నా చేతులెత్తి నీకు ప్రార్థన చేస్తాను" అంటాడు - 63,6, "రండి నమస్కారం చేసి చాగిలపడదాం, మనలను సృజించిన యావే సన్నిధిని మోకరిల్లుదాం, రండి యావేను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం" అంటాడు - 95,7. మన స్తుతి ప్రార్ధనంలో గూడ ఈలాంటి ఉత్సాహచిహ్నాలు కన్పించాలి. ఆనంద భావం గోచరించాలి.

5. ప్రభుని మనం ఏలా స్తుతిస్తాం? అతని పట్ల మనకు ఓ గాధానుభవం కలుగుతుంది. అతడు మనలను ప్రేమించాడనీ మనలను రక్షించాడనీ గుర్తిస్తాం, ఈ గుర్తింపు వలన మన హృదయం ద్రవించిపోతుంది. వెంటనే పవిత్రాత్మ మన హృదయాన్ని ఓ వీణనులాగ మీటుతుంది. దానితో మన యెడద పులకించిపోతుంది. మన అంతరంగంలోనుండి ఆరాధనా స్తుతీ గానమూ పెల్లబుకుతాయి. ప్రభుని గూర్చిన ప్రేమానుభవమే స్తుతి ప్రార్థనకు ఆధారం. 6. స్తుతి ప్రార్థనలో గొప్ప శక్తి వుంది. ఈ ప్రార్ధన మన హృదయాన్ని మార్చి వేస్తుంది, దీనివల్ల మన విచారం ఆనందం గాను, నిరాశ ఆశగాను, వ్యాధి ఆరోగ్యం గాను మారిపోతుంది. అందుకే సుతి ప్రార్ధన చేసేవాళ్ళ వ్యాధులు తటాలున నయమౌతుంటాయి. ఈ ప్రార్ధన వల్ల మానసిక రుగ్మత కూడ తొలగిపోయి హృదయాహ్లాదం చేకూరుతుంది.