పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బైబులు వాక్యాన్ని ఉదాహరిస్తారు. లేదా ఓ ఓదార్పు వాక్యం చెప్తారు. ఇది మనకు ప్రవచనంగా పనిచేస్తుంది. అనగా ఈ మాట ద్వారా ప్రభువు మనలను ప్రోత్సాహపరుస్తాడు, ఉదాహరణకు మదర్ తెరీసా డిసెంబరులో దివిసీమను సందర్శించినపుడు "ఈ విషాద సంఘటనం ద్వారా ప్రభువు మనకు ఏదో నేర్పుతున్నాడు" అంది, ఇది ప్రవచనమే.

4) ఒకోమారు మనవద్దనున్న ఓ వ్యక్తి మనకు తెలియని అన్యభాషలో ఏదో అంటాడు. మరోవ్యక్తి ప్రభువువలన ప్రబోధితుడై అతని మాటలకు అర్ధం చెపుతాడు. తరువాత ఆ మాటలు యధార్ధమేనని మనం పరిశీలించి తెలిసికొంటాం. అనగా ఆ మాటలు ఎవరికి వర్తిస్తాయో వాళ్ళే వాటి యాధార్థ్యాన్ని రుజువు చేస్తారు - 1కొ 14, 27-29.

5) కొందరిచేత ప్రభువు తన సందేశాన్ని చెప్పిస్తాడు. ఈ సందేశహరులు తాము చెప్పేది ప్రభు సందేశమనీ భావిస్తారు. ప్రభువే తమ్ము ఆ సందేశం చెప్పమని కోరుకొంటున్నాడనీ భావిస్తారు. వీళ్ళల్లో కొందరికి ప్రభువు తన సందేశాన్నీ ఆ సందేశాన్ని చెప్పే భాషనూకూడ అందిస్తాడు. కాని కొందరికి తన సందేశాన్ని మాత్రమే ఇస్తాడు. దాన్ని తెలియజేసే భాష ఆ సందేశహరుడే వెతుక్కోవాలి.

ఇక్కడ పేర్కొన్న ఐదురకాల ప్రవచనంలోను ఇప్పడు పెంతెకోస్తు సమావేశాల్లో బహుళ ప్రచారంలో వుంది మూడవరకం ప్రవచనం.

4 ప్రవచనం చెప్పడానికి సంసిద్దులం కావడం ఏలా? కొందరు అంతసులభంగా ప్రవచన వరానికి లొంగరు. మేమేమిటి, ప్రవచనం చెప్పడ మేమిటి అని భయపడి సిగ్గుతో జంకుతూ వెనుకాడతారు. కాని ప్రభువు ఈలాంటి వాళ్ళనుగూడ ప్రోత్సహించి వాళ్ళ చేత తన సందేశం విన్పిస్తుంటాడు, వాళ్ళ మనసుల్లో కేవలం సందేశాన్నో లేక ఆ సందేశాన్నీ దాన్ని చెప్పవలసిన భాషనూ రెండింటిని గూడానో, తానే పొందుపరుస్తూంటాడు. ఇక వాళ్ళు ఓ విధమైన నిర్బంధానికి గురై ప్రవచనం చెప్తారు. ఈలాంటి వాళ్ళల్లో మామూలుగా రెండు లక్షణాలు కన్పిస్తాయి. తాము పలానా సందేశాన్ని విన్పించాలి అనే కోరిక వాళ్ళల్లో బలంగా వుంటుంది. ఆ సందేశమూ దాన్ని విన్పించాలనే కోరికా రెండూ గూడ ఆత్మ నుండి వచ్చాయన్న నమ్మిక కూడ వీళ్ళల్లో వుంటుంది. పెంతెకోస్తు సమావేశాల్లో ఈలాంటి ప్రవక్తలను చాలామందిని చూస్తూంటాం.

ఐనా మనం ఓ డాక్టరుమో ఉపాధ్యాయుడిమో కావాలని నిర్ణయించుకొన్నట్లుగా ఓ ప్రవక్త కావాలని నిర్ణయించుకోలేం. మనంతట మనం ప్రవచనం చెప్పలేం. మనకు ప్రవచన వరమిచ్చేది ప్రభువే, మన బాధ్యత, ప్రభువు ఆ వరాన్ని ఇచ్చినపుడు దానికి లొంగిపోవడం - అంతే.