పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. ఆత్మను పొందడానికి కొన్ని షరతులు

1. ఒట్టినే పరిశుద్దాత్మ జ్ఞానస్నానం పొందితే ఏమీ ఫలితం కలుగదు. కనుక సోమరిపోతులూ చిత్తశుద్ధిలేని వాళ్ళూ దీనివల్ల ప్రయోజనం పొందలేరు. బైబులు భగవంతుడు గ్రుడ్డివాడు కాదు, నరుల హృదయాల్లోనికి తేరపారజూచేవాడు - 1 సమూ 16,7. కనుక ఎవరెలాంటివాళ్ళి అతనికి బాగా తెలుసు. ఆత్మజ్ఞానస్నానం పొందినవాళ్ళ నుండి దేవుడు కచ్చితమైన లెక్క అడుగుతాడు. కాని యోగ్యంగా జీవించే వాళ్ళను దండిగా దీవిస్తాడుగూడ, మొత్తంమీద పరిశుద్దాత్మ జ్ఞానస్నానం మంచివాళ్ళకీ మంచిజీవితం జీవిద్దామనే కోరిక కలవాళ్ళకేగాని సోమరిపోతులకు గాదు. ఆత్మతో మనకు జ్ఞానస్నానమిచ్చేది క్రీస్తు — అతడుమాత్రమే. కనుక మన ప్రవర్తనం అతనికి యోగ్యంగా వండాలి. ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందాలంటే మనతరపున మనం చక్కగా తయారు కావాలి. ఏలాగ?

2. ఆత్మ దిగివచ్చాక పేత్రు యెరూషలేములోని యూదులకు బోధిస్తూ "మీరు పరివర్తనం చెంది యేసుక్రీస్తు నామాన జ్ఞానస్నానం పొందినట్లయితే పాపపరిహారాన్నీ ఆత్మనీ పొందుతారు" అని చెప్పాడు - అచ 2, 38. ఈ వాక్యంలో మూడంశాలున్నాయి. మొదటిది, మనం హృదయ పరివర్తనం చెందాలి. బైబులు భగవంతుడు మహాపవిత్రుడు. అపవిత్రపాణిలో ప్రవేశించేవాడు కాదు. అందుచేత మనం పూర్వపాపాలనూ దురభ్యాసాలనూ పూర్తిగా మానుకోవాలి. పైగా రోషమూ ద్వేషమూ పగా మొదలైన పిశాచ గుణాలను వదులుకోవాలి, శత్రువులను హృదయపూర్వకంగా క్షమించాలి - మార్కు 11,25-26. మొత్తంమీద మన పరివర్తనం ఏలాగుండాలంటే, మనం చిన్న బిడ్డల్లా తయారు కావాలి. మన హృదయం చిన్న బిడ్డల హృదయంలా రూపొందితేనేగాని మనకు పరలోకప్రాప్తి లేదు - మత్త 18,3. ఈలాంటి హృదయాన్ని ఈయమని ఆ ప్రభువునే అడుగుకోవాలి.

3. రెండవది, ప్రభుని రక్షకునిగా స్వీకరించాలి. అతడు చావును జయించి ఉత్తానమైన ప్రభువని విశ్వసించాలి - రోమా 10,19. యేసుని అంగీకరించడమంటే, యికమీద మన స్వార్థం కోసం గాక ఆ ప్రభువుకోసం జీవించడానికి సిద్ధంకావాలి. ఇది చాల పెద్ద బాధ్యత, చాల కష్టమైన షరతు. ఇంకా ప్రభుని అంగీకరించడమంటే, మన పూర్వ పాపజీవితాన్ని అతని ముందుంచి తన నెత్తుటి ధారలతో మన హృదయాన్ని కడిగి శుభ్రంచేయమని అడుగుకోవాలి - దర్శ 1,5. ఆ ప్రభుని మనయందు జీవించమని