పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన జీవితంలో ముఖ్యాంశం మనమూగాదు, మన పనీగాదు, మరి ఆ ప్రభువు జీవితాన్ని జీవించడం. - గల 2, 20; ఫిలి 1,21.

ఆత్మచేసే కృషంతా గూడ మనలను క్రీస్తు చెంతకు చేర్చడమే. కనుక ఆయాత్మ మనలను కేవలం తనచెంతకు రాబట్టుకోదు. తనద్వారా క్రీస్తుచెంతకు రాబడుతుంది. ఈలా మనం క్రీస్తు కేంద్రీకృత జీవితం జీవించడమనేది పెంతెకొస్తు ఉద్యమంలోని ప్రధానాంశం.

10. ఆత్మతెచ్చే మార్పు

1. ఆత్మ క్రీస్తు జీవితంలో మార్పు కలిగించింది. శిష్యుల జీవితంలో మార్పు కలిగించింది. ఆలాగే మన జీవితంలోను మార్పు కలిగిస్తుంది. మొదట క్రీస్తుజీవితంలో కలిగిన మార్పును పరిశీలిద్దాం.

జ్ఞానస్నానం పొందిందాకా క్రీస్తు మామూలు మనిషిగానే కన్పించేవాడు. తోడి జనమంతా అతడు కేవలం వడ్రంగివాని కుమారుడు అనుకొంటూండేవాళ్లు - మత్త 13, 55-57. అందుకే సువిశేషాలుగూడ క్రీస్తు బాల్యాన్ని గూర్చి అట్టే ప్రస్తావించవు. కాని ఓమారు జ్ఞానస్నానం పొందాక క్రీస్తు మారిపోయాడు. క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో ఆకాశం తెరువబడగా దేవుని ఆత్మ పావురం రూపంలో అతనిమీదికి దిగివచ్చింది - మత్త3,16. అనగా అతడు పరిశుద్దాత్మను పొందాడు. దానితో అతనికి దివ్యశక్తి కలిగింది. ఆ శక్తితోనే అతడు పిశాచాన్ని ఎదిరించడానికి ఎడారికి వెళ్ళాడు. అటుపిమ్మట అద్భుతాలు చేయడం మొదలెట్టాడు, పరలోక రాజ్యాన్ని గూర్చి జనసమూహానికి బోధించడం ప్రారంభించాడు. అనగా అతడు మన రక్షకుడుగా వ్యవహరించడం మొదలెట్టాడు. పూర్వం వడ్రంగివాని కుమారుడుగా ఊరూపేరూ లేకుండా నజరేతు అనే కుగ్రామంలో జీవించిన క్రీస్తుకీ ఇప్పడు బహిరంగజీవితం జీవించే క్రీస్తకీ ఎంత వ్యత్యాసం ! ఈ మార్పు క్రీస్తు ఆత్మను పొందడంద్వారానే జరిగింది.

2. ఆత్మ శిష్యుల జీవితంలో గూడ పెద్దమార్పు తెచ్చింది. వాళ్లు మూడేండ్లపాటు క్రీస్తుతో తిరిగారు. అతని బోధలు చెవులారా విన్నారు. అద్భుతాలు కండ్గారా చూచారు. ఐనా వాళ్ళల్లో పెద్ద మార్పేమీ కలుగలేదు. అసలు వాళ్ళు క్రీస్తు సందేశాన్ని అర్థం చేసికోనేలేదు. అతడెందుకు వచ్చాడో గ్రహించనేలేదు. కనుకనే ప్రభువు మోక్షారోహణం చేసేపుడు గూడ "నీవు యిప్పడు యిస్రాయేలుకు రాజ్యాన్ని మళ్ళా సంపాదించిపెట్టవా"? అని అడిగారు - అకా 1,6. అనగా నీవు రోమను ప్రభుత్వంతో యుద్ధంచేసి పాలస్తీనా