పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ప్రభువు దయ్యాన్ని ఓడించాడు. ప్రభువు వచ్చిందాకా పిశాచం ఈ లోకపు నాయకుడు. తాను బలవంతుడై ఈ లోకాన్ని ఏలేవాడు. కాని క్రీస్తు వచ్చి ఈ లోకాధికారిని వెలుపలకు గెంటివేసాడు - యోహా 12, 31. ప్రభువు మహాబలవంతుడు. అతడు వచ్చి బలవంతుడైన పిశాచాన్ని బంధించి వాని యిల్లు కొల్లగొట్టాడు — మత్త 12, 29. పిశాచం ఆకాశంనుండి మెరపుతీగలా పడిపోతూండగా ప్రభువు చూచాడు - లూకా 10, 18. ఈ వాక్యాలన్నీ ప్రభువు పిశాచాన్ని జయించాడు అనడానికి నిదర్శనాలు. కాని ప్రభువు పిశాచాన్ని ఎందుకు జయించాడు? తనకోసం గాదు. మన కోసం. అతని విజయం మన విజయం, కనుక మనం పిశాచంతో పోరాడేపుడు అతని విజయం మనమీద సోకి మనం దయ్యాన్ని జయించేలా చేస్తుంది. బలహీనమైన సన్నని తీగ మహావృక్షం మీదికి ఎగబ్రాకి ఆ వృక్షం బలంలో తానూ పాలుపొందుతుది. ఆలాగే బలహీనులమైన మనం ప్రభువుతో ఐక్యమై అతని బలంలో పాలుపొందుతాం. ఆ బలంతోనే భూతాన్ని జయిస్తాం.

5. మన తరపున మనం ప్రభుసహాయం అడుగుకోవాలి. అతని దివ్యనామాన్ని భక్తితో ఉచ్చరించి పిశాచాన్ని తరిమివేయాలి. ఆ ప్రభువు దివ్యరక్తం పేరుమీదుగా దయ్యం వెళ్ళి పోవాలని అడుగుకోవాలి. ఆ ప్రభువు పరిశుద్ధాత్మద్వారా దుష్టాత్మ పారిపోవాలని ప్రార్ధించాలి. ఆ ప్రభువు ఉచ్చరించిన వాక్యాలను బైబుల్లో పదిలపరచి వుంచారు. ఆ బైబులు వాక్యాలను చదివి పిశాచాన్ని తరిమివేయాలి. ఆ ప్రభువు పరిశుద్ధ జననియైన మరియమాత పేరుమీదిగా సైతాను పలాయనం కావాలని ప్రార్ధించాలి. పిశాచాన్ని జయించే మార్గాలు ఇవి.

6. పరిశుద్ధాత్మా అపరిశుద్ధాత్మయైన పిశాచమూ ఒకరినొకరు సహింపరు. కనుక పరిశుద్దాత్మ ఉన్నకాడ పిశాచం వుండలేదు. పిశాచం వున్నకాడ పవిత్రాత్మ వుండదు. వాళ్ళిద్దరూ వెలుగూ చీకటిలాంటివాళ్లు.పవిత్రాత్మ మనలను క్రీస్తు చెంతకు చేర్చాలని కోరుకొంటుంది. పిశాచం మనలను క్రీస్తు చెంతనుండి కొనిపోయి నరకకూపంలో పడద్రోయాలని కోరుకొంటుంది. కనుక మనం పవిత్రాత్మను మన హృదయంలో ప్రవేశపెట్టమనీ, పిశాచం మన హృదయంలో ప్రవేశించకుండా వుండేలా చేయమనీ ప్రభుని మనవిచేసికోవాలి.

8. ప్రభువు పరిశుద్ధాత్మతో జ్ఞానస్నానం ఇచ్చేవాడు

1. ప్రభువు ప్రజలకు పరిశుద్దాత్మతో జ్ఞానస్నానమిస్తాడు. “అతడు పవిత్రాత్మతోను అగ్నితోను జ్ఞానస్నానమిస్తాడు - లూకా 8, 16; యోహా 1, 33. కనుక ఉత్థాన క్రీస్తు పెంతెకోస్తు నాటినుండి భక్తులకు పరిశుద్దాత్మతో జ్ఞానస్నానం ఈయడం మొదలెట్టాడు. తండ్రి