పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంక్రమించిన జన్మపాపం ద్వారా మన మానవ స్వభావం బలహీనమైపోయి పాపం వైపు మొగ్గుతుంది. మూడవది, పిశాచం కూడ మనలను బాధిస్తుంది. ఈ పిశాచం నుండికూడ ప్రభువు మనకు విముక్తి దయచేయాలి. 2. కొంతమంది పిశాచం లేదు అని చెపూంటారు. దయ్యాన్ని నమ్మరు. ఈలా తలంచడం చాలా ప్రమాదకరం, తెలిసిన శత్రువు కంటె తెలియని శత్రువువలన ఆపద యొక్కువ. దయ్యం లేదులే అని ధీమాగా వుండిపోతే అది మనలను సులభంగా మోసగిస్తుంది. మరి కొంతమంది జీవితంలో ఏ కీడు వాటిల్లినా అది దయ్యమే చేసిందనుకుంటారు. దయ్యం మనకు కీడుచేసే మాట నిజమేగాని, మనకు కలిగే కీడులన్నీ దయ్యాన్నుండి కాదు. ఈ రెండు విపరీత మార్గాలకు మధ్యలో వుంది సత్యమార్గం. దయ్యం అనే శక్తి వొకటుంది. ఆ శక్తి మనకు హాని చేయాలని కోరుకొంటుంది. మన శత్రువైన పిశాచం గర్జించే సింహంలా తిరుగుతూంటుంది. ఎవరిని బ్రిమింగివేద్దామా అని చూస్తూంటుంది. కనుక మనం జాగ్రత్తగా వుండాలి - 1 పేత్రు 5,8. మన శత్రువులందరిలో పెద్ద శత్రువు పిశాచం. అది మానవజాతికే శత్రువు. ఈ విరోధినుండి మనం తప్పకుండా జాగ్రత్తపడాలి. 3. పిశాచం మనలను బాధిస్తుంది. తన అదుపులోకి తెచ్చుకొంటుంది. ఈ క్రింది సందర్భాల్లో మనం పిశాచం అదుపులో వున్నామనే అనుకోవాలి.

1) కొందరు పిశాచాన్ని పూజిస్తూంటారు. దయ్యాన్ని ఆహ్వానించి దానిచేత ఈపనీ ఆపనీ చేయిస్తూంటారు. ఈలాంటివాళ్లు దయ్యానికి అమ్ముడు పోయినట్లే.
2) కొందరు తోడి జనంపట్ల విపరీతమైన ద్వేషాన్ని చూపెడుతూంటారు. భగవంతుడు ప్రేమమయుడు, పిశాచం ద్వేషనిధి. కనుక ఎవరిలోనైనా విపరీత ద్వేషం వుంటే వాళ్ళల్లో పిశాచం వున్నట్లే. బద్దవైరమూ, అధికరోషమూ పిశాచ ప్రవేశానికి మార్గాలు.
3) ఒకోమారు ఏదోశక్తి మనలను పాపం చేయమని నిర్బంధించినట్లుగా వుంటుంది, ఈ నిర్బంధంవల్ల జనం మద్యపాన ప్రీతి, ముష్టిమైథునం మొదలైన పాపాలు కట్టుకొంటారు. ఈ దురభ్యాసాలను మానుకొందామనుకొన్నా మానుకోలేరు. ఇక్కడ కూడ పిశాచశక్తి పనిచేస్తూన్నట్లే భావించాలి.
4) కొంతమంది మరోరకమైన నిర్బంధానికి గురౌతారు. జనంతో కలియకుండా ఒంటరిగా వుండిపోతూంటారు. ఆత్మహత్య చేసికోగోరుతారు. ఈలాంటపుడుగూడ పిశాచం పూనినట్లే.
5) ఇంకా కొందరిని విపరీతమైన భయాలు కృంగదీస్తూంటాయి. కొందరికి చావంటే మహా భయం. ఇంకా కొందరికి చీకటంటే విపరీతమైన భయం. ఈలాంటి విపరీత భయాలు కూడ పిశాచావేశానికి చిహ్నాలే. ఈలాంటి బాధలన్నిటినుండీ ప్రభువు మనకు విముక్తి కలిగించాలి.