పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుసు. ఈ విషపాశాలనుండి మనలను విడిపించి మనకు పూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ప్రభువు సిద్ధంగావున్నాడు. 3. ప్రభువు మనకు పూర్వస్మృతులనుండి ఆరోగ్యంప్రసాదించవలసిన రంగాలు చాలావున్నాయి. కొన్నిటిని ఈ క్రింద ఉదహరిస్తున్నాం.

1) మన మనోభావాలు విషమించి మనలను బాధిస్తాయి. దీని వల్ల మనకు విపరీతమైన సిగ్గూ, బిడియమూ, విచారమూ, ఒంటరిపాటూ, హైన్యభావాలూ కలుగుతాయి.
 2) మన మానసిక గుణాలుకూడ విషమించి మనలను పాపంవైపు నడిపిస్తాయి. ఈ కారణంవల్ల కోపమూ, ద్వేషమూ, వైరమూ, పగా, అసూయా మొదలైన దురుణాలు మనహృదయంలో తావు చేసికొంటాయి.
 3) కొన్ని దురభ్యాసాలు మనలను నిర్బంధపరుస్తాయి. ఇందువల్ల మనం మద్యపానప్రీతి, ముష్టిమైథునం మొదలైన దురభ్యాసాలకు అలవాటు పడిపోతాం. ఇక ఆ చెడు అలవాటులను తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం. అవి మనలను నిర్బంధపెడతాయి. ఈ రంగాలన్నిటిలోను ప్రభువు మనకు ఆరోగ్యం ప్రసాదించవలసిందే.

4. ఈ పూర్వస్మృతులనుండి ఆరోగ్యం పొందాలంటే ప్రభువుకి ప్రార్థనలు అర్పించుకోవాలి. ఈ ప్రార్థనలు చేసేపుడు పాటించవలసిన నియమాలు ఇవి.

1) ప్రభువు మన రక్షకుడు, ఆరోగ్యదాత. అతన్ని మన జీవితంలోకి ఆహ్వానించి మన ప్రస్తుత బాధని అతని ముందు పెట్టాలి, మనం ఈ బాధతో సతమత మౌతూన్నామని అతనికి తెలుసు. మనమేలు కోసమే ప్రభువు దాన్ని అనుమతించాడు.
 2) ఈ ప్రస్తుత బాధకు ఆధారమైన పూర్వస్మృతి ఏదో వుంది. కనుక ప్రభువుతో మనపూర్వ జీవితంలోకి వెళ్ళాలి. అనగా మన బాల్యజీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, ఆనాడు ప్రభువు మనపై గల ప్రేమచేతనే ఆ సంఘటనను జరుగనిచ్చాడు.
 3) ఆ పూర్వస్మృతిని ఇప్పడు జ్ఞప్తికి తీసికొనిరమ్మని పరిశుద్దాత్మను అడుగుకోవాలి.
 4) ఆనాడు ఆ సంఘటనంద్వారా మనకు హాని చేసి ఆలాంటి స్మృతికి కలిగించిన వ్యక్తులను క్షమించమని ప్రభుని ప్రార్థించాలి. మన తరుపున మనం పూర్తిగా వాళ్ళను క్షమించాలి. ప్రభువు వాళ్ళను దీవించాలనికూడ ప్రార్ధించాలి. ఒకవేళ మనమే ఇతరులకు హాని చేసివుంటే ప్రభుని క్షమాపణం అడుగుకోవాలి.
 5) ఆ స్మృతిని ప్రభువు ముందు పెట్టి దాన్ని నయంజేయమని అడుగుకోవాలి. దానివల్ల మనం ఇప్పడు బాధ పడకుండా వుండేలా గూడ చేయమని ప్రార్ధించాలి.