పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3.నాల్గవ శతాబ్ద భక్తుడైన క్రిసోస్తం ఈలా వ్రాసాడు, "సైనికుడు పరిశుద్ధ దేవాలయం గోడకు కన్నం వేసాడు. ఆ దేవాలయంలోని నిధి నా కంటబడి ది వెంటనే నేను దాన్నిస్వాధీనం చేసికొన్నాను." క్రిసోస్తం భక్తుడు పేర్కొన్న ఈ నిధి తిరుహృదయమే. అది ప్రేమకు నిలయం. వరప్రసాదాలకు ఆకరం. కనుక మనం ఆవశ్యం తిరుహృదయ భక్తిని అలవర్చుకోవాలి.

4.భక్తులు చాలమంది దివ్యహృదయాన్ని ఆశ్రయంగా భావించారు. 13వ శతాబ్ద భక్తుడు బోనవెంచర్ ఈలా వ్రాసాడు, "ప్రభూ! నీ ప్రక్కను ఈటెతో ఎందుకు పొడిచారు? మేము నీ హృదయంలోకి ప్రవేశించే మార్గం ఏర్పడ్డానికేగదా? మేము ఈ ప్రపంచ వ్యామోహాల నుండి వైదొలగి నీ హృదయంలో నివాస మేర్పరచుకోవడానికే గదా? ఈటె క్రీస్తు ప్రక్కను పొడిచి గాయంచేసింది. కొండ బండలో నెర్రె ఏర్పడింది. క్రీస్తు భక్తుడా లే! రాతి నెర్రెలో గూడుకట్టుకొనే పావురంలాగే నీవుకూడ తెరువబడిన క్రీస్తు హృదయంలో నివాసమేర్పరచుకో" ఈ భక్తుడు సూచించినట్లుగా మన కష్టసుఖాల్లోను మనం క్రీస్తు హృదయంలోనికి ప్రవేశిస్తూండాలి.

5.దేవుని ప్రేమకి బదులు ప్రేమ చూపడం తిరుహృదయ భక్తిలో ఓ భాగమని చెప్పాం. కాని సోదరప్రేమ లేందే దైవప్రేమ లేదు. నా సోదరుల్లో అత్యల్పనికి చేసిన కార్యం నాకు చేసినట్లే భావిస్తాను అన్నాడు ప్రభువు - మత్త 25,40. కనుక మనం తోడి నరులను విశేషంగా పేదసాదలను, ఆదరంతో చూస్తుండాలి. ఈ సోదరప్రేమ మన దైవప్రేమను వృద్ధిచేస్తుంది.

6.తిరుహృదయ పండుగలోవచ్చే ఫ్రిఫేస్ ప్రార్ధనం యిది. "క్రీస్తు సిలువమీదికి ఎత్తబడినపుడు మన కొరకు ప్రాణాలర్పించాడు. మనపట్ల అతనికికల ప్రేమ అంత గొప్పది. గాయపడిన అతని ప్రక్కలోనుండి నీళ్ళూ నెత్తురూ స్రవించాయి. ఈ ప్రక్కయే శ్రీసభలోని సంస్కారాలన్నిటికీ ఆధారం. రక్షకుడు తెరువబడిన తన హృదయంలోనికి నరులనందరినీ ఆహ్వానిస్తాడు. ఆ రక్షణపు బుగ్గనుండి మనం ఆనందంతో జలాన్ని స్వీకరించవచ్చు." క్రీస్తు హృదయం ఆత్మకూ, వరప్రసాదానికీ, రక్షణకూ నిలయమని ఈ ప్రార్ధనం భావం, తిరుహృదయ భక్తికి మనం ఏలాంటి విలువనీయాలో ఈ ప్రార్థనే తెలియజేస్తుంది.