పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు రాజ్యపదవి కూడ అంతం కాదు. పరిపూర్ణమౌతుంది. అసలు అతని రాజ్యానికి అంతం ఉండదు - లూకా 1, 33,

దేవునికి మానవునికీ మధ్య మధ్యవర్తి క్రీస్తు, అతని మధ్యవర్తిత్వం కలకాలం వుంటుంది. మోక్షంలో మనం అతనిద్వారానే ఎల్లకాలం తండ్రిని దర్శిస్తాం. కనుక అతడు సర్వకాలం మధ్యవర్తి, రాజు.

.ప్రార్ధనా భావాలు

1.క్రీస్తు నరావతారమెత్తి తండ్రిని తెలియజేసాడు. మరణోత్దానాలకు గురై నరులను రక్షించాడు. మహిమను పొంది రాజయ్యాడు. నరావతారంతో ప్రారంభమైన అతని జీవితం రాజపదవితో పరిపూర్ణమౌతుంది. క్రీస్తు జీవిత సంఘటనలు మనకు రక్షణదాయకా లౌతాయి. కనుక వాటిని భక్తిభావంతో విశ్వసించే భాగ్యాన్ని దయచేయమని ప్రభువుని అడుగుకొందాం.

2.క్రీస్తురాజు పండుగ పూజలోవచ్చే ప్రెఫేస్ ప్రార్ధనం ఈలా చెప్తుంది. "క్రీస్తు రాజ్యం సత్యంతోను జీవంతోను కూడింది. పావిత్ర్యంతోను వరప్రసాదంతోను నిండింది, న్యాయం ప్రేమ శాంతి అనే గుణాలతో ఒప్పింది." ఈ రాజ్యం నేటి తిరుసభే, మనం ఈ రాజ్యానికి చెందినవాళ్ళం, ఈ భాగ్యానికి ప్రభువునకు వందనాలు అర్పించాలి.

3.పరలోక జపంలో మీ రాజ్యం వచ్చునుగాక అని చెప్తాం. దైవరాజ్యమూ క్రీస్తు రాజ్యమూ ఒకటే. ఈ రాజ్యం ప్రధానంగా మన హృదయాల్లో నెలకొంటుంది. కాని మన హృదయంలో పిశాచరాజ్యంకూడ వుంటుంది. అది కూలిపోతేనేగాని దైవరాజ్యం మన గుండెల్లో చోటుచేసికోదు - యోహా 12,31. జ్ఞానస్నానంనుండే తండ్రి మనలను 'అంధకార శక్తినుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి తోడ్కొని వచ్చాడు" - కొలో 1,13. దీనికి తగినట్లుగా మనం పవిత్ర జీవితం జీవిస్తూ మన హృదయంలో దైవరాజ్యాన్ని పెంపొందించు కొంటూండాలి.

4.మనంకూడ ప్రభువు రాజపదవిలో పాలుపొందుతాం. పరలోకంలో అతనితోపాటు రాజ్యపాలనం చేస్తాం - లూకా 22,29-30. కాని ఈ భాగ్యాన్ని పొందాలంటే మనం ఇప్పటినుండే భక్తివిస్వాసాలతో జీవించాలి. క్రీస్తుని సేవించాలి. అతని యాజ్ఞలు పాటించాలి. అప్పడు కాని జీవితాంతంలో మనంకూడ ఆ మంచి దొంగలాగే "యేసూ! నీవు నీ రాజ్యంలో ప్రవేశించినపుడు నన్నుకూడ జ్ఞాపక మంచుకో" అని చెప్పలేం- లూకా 23,42.