పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అతడు ఆ ప్రజను వాగ్దత్తభూమికి చేర్చాడు. ఏలీయా దాటిపోతూ యెలీషాను ప్రవక్తగా నియమించాడు. అతడు గురువుగారి ప్రవచన సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఆలాగే క్రీస్తు తండ్రివద్దకు వెళ్ళిపోతూ పరిశుద్దాత్మను రెండవ ఆదరణకర్తగా నియమించాడు. క్రీస్తు తర్వాత వచ్చిన ఈ యాత్మక్రీస్తు రక్షణకార్యాన్ని కొనసాగిస్తుంది. మనలను క్రీస్తు చెంతకు చేరుస్తూంటుంది. లోకాంతం వరకు ఈ కార్యం ఈలాగే కొనసాగాలి. కనుక ఇప్పడు మనం ఆత్మద్వారా తప్పితే మరో మార్గంలో క్రీస్తుని చేరలేం. కావున ఆ యాత్మపట్ల మనకు తప్పక భక్తి వుండాలి.

3. మనం క్రీస్తుద్వారా ఒకే ఆత్మయందు తండ్రిని చేరుతాం అన్నాడు పౌలు - ఎఫె 2,18. అంటే మనం ఆత్మ సహాయంతో క్రీస్తుని చేరతాం. క్రీస్తుద్వారా తండ్రిని చేరతాం. పూర్వవేదకాలంలో తండ్రి ప్రజలకు మొదటి నాయకుడు, అతని తర్వాత నూత్నవేదకాలంలో క్రీస్తు రెండవ నాయకుడుగా వచ్చాడు. క్రీస్తు తర్వాత పవిత్రాత్ముడు మళ్ళా మూడవ నాయకుడుగా వచ్చాడు. ఇక త్రీత్వంలో నాల్గవ నాయకుడంటూ లేడు. కనుక ఇప్పడు మనం ఆత్మ ద్వారా క్రీస్తనీ, క్రీస్తుద్వారా తండ్రినీ చేరుకోవాలి. ఇప్పడు ఆత్మ అనుగ్రహంలేందే క్రీస్తు దొరకడు.

4. ఆత్మ గొప్ప శక్తి. కనుక ప్రభువు శిష్యులతో "పవిత్రాత్మ మీమీదికి వచ్చినపుడు మీరు శక్తిని పొందుతారు" అని పల్కాడు - అచ 1,8. ఆ శక్తితోనే శిష్యులు ప్రభువుని బోధించారు, భూదిగంతాలవరకూ అతనికి సాక్షులుగా నిల్చారు. నేడు మనంకూడ క్రీస్తుకి సాక్షులంగావుండి అతన్ని బోధించాలి అంటే ఆత్మ శక్తి అవసరం, కాని క్రీస్తుని బోధించడమనేది కేవలం ఉపన్యాసాలద్వారానే జరగదు. ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం ద్వారాగూడ జరుగుతుంది. కావున భక్తి విశ్వాసాలతోగూడిన క్రైస్తవ జీవితం జీవించి ప్రభువుకి సాక్షులంగా వుండే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువు ఆత్మనుండే అడుగుకొందాం.

10. క్రీస్తు రాజు క్రీస్తు

పాస్క కార్యాలు అతని మరణంతో ప్రారంభమై అతని రాజపదవితో పరిపూర్ణమౌతాయి. పూర్వవేదంలో తండ్రిలాగే నూత్నవేదంలో కుమారుడుకూడ రాజు. అతని రాజ్యాధికారం ప్రత్యక్షంగా తిరుసభమీదా పరోక్షంగా ఈ విశ్వమంతటిమీదా చెల్లుతుంది. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.