పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని లూకా సువిశేషం తిలకిస్తే మరో సంప్రదాయం కన్పిస్తుంది. క్రీస్తు మరణించాక మూడు రోజులకు ఉత్తానమయ్యాడు. ఉత్తానమయ్యాక 40 రోజులకు మోక్షారోహణం చేసాడు. ఈ మోక్షారోహణం అతడు శిష్యులకు ప్రసాదించిన తుది శారీరక దర్శనం. దీని తర్వాత వాళ్ళతన్ని మళ్ళా శారీరకంగా చూడరు. ఉత్తానానంతరం 50 రోజులకు అతడు ఆత్మను పంపాడు.

యోహాను దృష్టిలో క్రీస్తు పాస్క వృత్తాంతాలన్నీ కలసి ఒక్కసంఘటనమౌతాయి. లూకా దృష్టిలో అవి పరస్పరవ్యవధికల వేరువేరు సంఘటనలౌతాయి. యోహాను ఈ వదంతాలన్నిటినీ ఏకంచేసి చెప్పడంవల్ల అతని సువిశేషంలో వాటిని అర్థం చేసికోవడం కొంచెం కష్టంగా వుంటుంది. లూకా వీటిని విడివిడిగా విభజించిచెప్పడంవలన అతని సువిశేషంలో వీటిని అర్థం చేసికోవడం సులభంగా వుంటుంది. కాని లూకాకంటె యోహానే యధార్థానికి దగ్గరగా వుంటాడు. యధార్థంగా క్రీస్తు పాస్క కార్యాలన్నీ ఏకకాలంలోనే జరిగిపోయాయి. అవన్నీ కలసి ఒకే రక్షణ కార్యమౌతాయి. రలా రూహాను లూకా భిన్న సంప్రదాయాలను అనుసరించినా అవి పరస్పర విరుద్దాలు కావు. అవి ఒకదాన్నొకటి సంపూర్ణం చేసికొంటాయి.

తిరుసభ ఆరాధనలో నాల్లో శతాబ్దం వరకు క్రీస్తు పాస్కకార్యాలన్నీ ఏక సంఘటనంగానే పరిగణింపబడ్డాయి. తొలినాటి క్రైస్తవులు క్రీస్తు రక్షణకార్యం అతని మరణంతో ప్రారంభమై ఆత్మ ప్రదానంతో ముగుస్తుందనీ, అది యేక రక్షణక్రియ అనీ భావించారు. నాల్గవ శతాబ్దం నుండి మాత్రమే క్రైస్తవులు ఆ యేకక్రియను భిన్న సంఘటనలుగా విభజించడం ప్రారంభించారు. నేడు మనం వాటిని ఏకక్రియగా గ్రహించాలి.

ప్రార్ధనా భావాలు

1. క్రీస్తు ఉత్థానంద్వారా మనకు జీవమీయడానికి సిద్ధమయ్యాడు. మోక్షారోహణంద్వారా ప్రభువుగా సింహాసనాసీనుడయ్యాడు. ఆత్మ ప్రదానంద్వారా మనలను పవిత్రులను చేయడం మొదలుపెట్టాడు. మనకు జీవమీయడం ప్రారంభించాడు. ఈ మూడు కార్యాలు ఒకే రక్షణ సంఘటనమని చెప్పాం. పవిత్రమైన ప్రభువు పాస్క కార్యాలను భక్తిభావంతో ధ్యానంచేసికొనే భాగ్యంకొరకు వేడుకొందాం.

2. పూర్వవేదంలో ఇద్దరు నాయకుల సంప్రదాయం వుంది. పూర్వనాయకుడు ప్రారంభించిన పనిని రెండవ నాయకుడు కొనసాగిస్తాడు. ఉదాహరణకు మోషే దాటిపోతూ యోషువాను యిస్రాయేలు ప్రజలకు నాయకునిగా నియమించాడు.