పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. క్రీస్తు మోక్షారోహణం

క్రీస్తు మోక్షారోహణం ప్రధానంగా అతని మహిమను తెలియజేస్తుంది. మనమూ అతని మహిమలో పాలు పొందుతాం. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. మోక్షారోహణ సంకేతాలు

అపోస్తలుల చర్యల గ్రంథం 1,9-14 క్రీస్తు మోక్షారోహణాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ “నలువదినాళ్ళ" "మేఘం' "దేవదూతలు" అనే మాటల భావం పరిశీలించిచూద్దాం. ప్రభువు మరణానికి పిమ్మట నలభై రోజులదాకా శిష్యులకు దర్శనమిస్తూ వచ్చాడు - 1,3. అతడు ఈ లోకంలో సేవకు పూనుకోకముందు నలువదినాళ్లు ఎడారిలో సంసిద్ధమయ్యాడు. అలాగే పరలోకంలో తండ్రి యెదుట సేవకు పూనుకోకముందు మళ్ళా నలువదినాళ్ళ సిద్ధమయ్యాడు. ఈ నలభై ఖచ్చితంగా నలభైరోజులనుగాదు, సుదీర్ఘకాలాన్ని సూచిస్తుంది. యూదులకు నలభై పరిపూర్ణమైన సంఖ్య

ప్రభువు ఒలీవ కొండమీద నుండి మోక్షారోహణం చేసాడు. పూర్వం ఈ కొండమీదినుండి ప్రభువు తేజస్సు యెరూషలేమును వీడిపోతుండగా యెహెజ్కేలు ప్రవక్త చూచాడు - యెసే 11,23. ఇప్పడు మళ్ళా కొండమీది నుండే తండ్రి తేజస్సు ఐన క్రీస్తు కూడ యెరూషలేము వీడి వెళ్ళిపోయాడు.

మోక్షానికి ఎక్కిపోతున్న క్రీస్తుని ఓ మేఘం కప్పివేసింది - 1,9. బైబుల్లో మేఘం దైన సాన్నిధ్యానికి గుర్తు. ఇదే మేఘం క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో దివ్యరూపధారణ సమయంలోను కన్పిస్తుంది. ఈ సందర్భంలో ఇద్దరు దేవదూతలుకూడ శిష్యులకు కన్పించారు. వీళ్ళ క్రీస్తు సమాధి చెంత పుణ్యస్త్రీలకుకూడ దర్శనమిచ్చారు. బైబుల్లో దేవదూతలుకూడ దైవసాక్షాత్కారానికి గుర్తుగా వుంటారు,

క్రీస్తు ఉత్తానము మోక్షారోహణము వేరువేరు కార్యాలు కాదు. అవి రెండు ఒకే సంఘటనం. క్రీస్తు ఉత్థానం కాగానే తండ్రి సన్నిధినికూడ చేరుకొన్నాడు. ఐనా అతడు ఇంకా నలువదినాళ్లు శిష్యులతో మెలుగుతూ వాళ్ళకు దర్శనమిస్తూ వచ్చాడు. ఆ దర్శనాల్లో చివరిదాన్ని ఇక్కడ లూకా మోక్షారోహణంగా వర్ణించాడు. ఆ మీదట ప్రభువు మళ్ళా భౌతికంగా శిష్యులకు కన్పించడు.

క్రీస్తు తండ్రివలన పరలోకానికి చేర్చబడ్డాడు - 1,11. అది అతడు పొందిన మహిమ. పూర్వం అతడు విధేయుడై మోక్షంనుండి మన మంటిమీదికి దిగివచ్చాడు. ఆ విధేయతకూ వినయానికీ బహుమానంగా తండ్రి ఇప్పుడు క్రీస్తుని మోక్షానికి కొనిపోయాడు.