పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

1.ప్రార్థనా భావాలు

1.క్రీస్తుని అనుసరించేవాళ్ళక్రైస్తవులు. కాని మనం ఏనాడో గతించి కాలగర్భంలో కలిసిపోయిన నాయకుణ్ణి అనుసరించం. మన నాయకుడైన క్రీస్తు కేవలం రెండు వేలయేండ్లనాడు జీవించినవాడు మాత్రమేకాదు. అతడు ఈనాడు కూడ తిరుసభలో సజీవుడై వున్నాడు. ఉత్థానంద్వారా మన ఆధునిక ప్రపంచంలో, మన మధ్యలో ప్రత్యక్షమై వున్నాడు. తన ఆత్మద్వారా నిత్యం మనకు ప్రేరణం పుట్టిస్తుంటాడు. అలాంటి సజీవనాయకుడూ చైతన్యమూర్తి ఐన క్రీస్తుని అనుసరించే భాగ్యం కలిగినందుకు మనమెంతైనా సంతోషించాలి.

2.ఉత్థానం క్రీస్తు మృత్యువుమీద విజయం సాధించాడని తెలియజేసేది మాత్రమేకాదు. అతడు దేవుడని రుజువుచేసేది మాత్రమే కాదు. అతని శ్రమలకుగాను తండ్రి అతన్ని బహూకరించాడని తెలియజెప్పేది మాత్రమేకాదు. అది ప్రధానంగా మన రక్షణ సంఘటనం. ఉత్థానంద్వారానే మనకు పాప విమోచనం కలిగింది. ఈ సంఘటనమే కనుక లేకపోయినట్లయితే మనమింకా మన పాపాల్లోనే వుండిపోయేవాళ్ళం. మన విశ్వాసమంతా వ్యర్ధమైపోయేది - 1కొ 15, 17 ఈలా మన రక్షణానికి పట్టుగొమ్మయైన ఈ దైవరహస్యాన్ని మనం గాఢభక్తితో విశ్వసించాలి.

3.క్రీస్తు నూత్న నరజాతికి జీవనదాత. మనుష్యావతారం ద్వారా ఆ జీవనదాత మొట్టమొదటిసారిగా మన నరజాతిలోనికి ప్రవేశించాడు. సిలువమీద చనిపోవడంద్వారా అతడు రక్షణావరోధాలను నిర్మూలించాడు. నరులు దివ్యజీవాన్ని స్వీకరించడంలో వున్న అడ్డంకులన్నీ తొలగించాడు. కడన ఉత్తానంద్వారా అతడు మనకు దివ్యజీవాన్ని ప్రసాదిస్తాడు. ఈ యంశాన్నిగూర్చే హెబ్రేయులజాబు “అతడు పరిపూరుడై తనకు విధేయులైన వారికందరికి నిత్యరక్షణకారకుడయ్యాడు" అని చెప్నంది - 5,9. ఈ వాక్యం భావం ప్రకారం ఉత్తానం ద్వారా క్రీస్తు పరిపూరుడౌతాడు, ఆ పిమ్మట మనకు రక్షణం దయచేస్తాడు. క్రీస్తు దయచేసే రక్షణమూ దివ్యజీవనమూ ఏమిటంటే వరప్రసాదమూ పవిత్రతాను. నేడు మనం క్రీస్తునుండి ఈ దివ్యజీవాన్ని అందుకోవడానికి సంసిద్ధంగా వుండాలి.