పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోకుతుంది. కనుక జ్ఞానస్నాన సమయంనుడే మనం నైతిక జీవితం జీవించాలి. పూర్వం యూదులు నిబంధనం వలన మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవింప బాధ్యులయ్యారు. ఉత్తాన క్రీస్తులోనికి పొందే జ్ఞానస్నానమే మన నిబంధనమౌతుంది. కనుక ఈ జ్ఞానస్నానంనుండి మనం రెండవ మోషేయైన క్రీస్తు కట్టడలు పాటించాలి.

2. ఉత్తానక్రీస్తు ఆత్మద్వారా పనిచేస్తాడు. కనుక నైతిక జీవితంలో మనలను నడిపించేదిగూడ ఆత్మే పాపపుణ్యాల విషయంలో మన అంతరాత్మను ప్రబోధించేది ఆ పరిశుద్ధాత్మే మోషే ధర్మశాస్త్రం రాతిపలకమీద వ్రాయబడింది. కాని క్రీస్తు ధర్మశాస్త్రం ఆత్మచే మన హృదయం మీదనే వ్రాయబడుతుంది. కనుక మనం ఆ యాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకొంటూ నిర్మల జీవితం గడపాలి.

3. ఇప్పడు క్రీస్తు పరలోకంలో తండ్రి ప్రక్కన ఆసీనుడై యున్నాడు. కనుక మన హృదయాలనుగూడ ఈ భూమి మీది వస్తువులమీదినుండి వైదొలగించి ఆ పరలోకంలోని వస్తువులమీదికి మరల్చుకోవాలి. ఇది చాల దొడ్డ భాగ్యం. కనుకనే కీర్తనకారుడు

"మోక్షంలో మాత్రం నీవుదప్ప ఇంకెవరున్నారు?
ఈ లోకంలో నీవు దప్పితే మరొకటి నాకు రుచించదు"
అన్నాడు - 73,25. ఈ మనస్తత్వం మనకుకూడ అబ్బితే ఎంత బాగుంటుంది!

4. ఉత్థానం దేహానికి సంబంధించింది. కనుక మన దేహాన్ని పవిత్రంగా వుంచుకోవాలి. ప్రస్తుతం ప్రపంచంలో నరదేహం కామవస్తువుగా మారిపోయింది. సినిమా, టీవీ ప్రకటనలు మొదలైన ప్రచార సాధనాల్లోనైతేనేమి, రోజువారి అలంకరణ విధానంలోనైతేనేమి మానుష దేహం - విశేషంగా స్త్రీదేహం - పశుప్రాయమైన కామాన్ని రెచ్చగొట్టే సాధనంగా పరిణమించింది. ఈలాంటప్పుడు క్రైస్తవ భక్తులు తమ దేహాన్ని చాల పవిత్రంగా వుంచుకోవాలి. ఈ దేహం జ్ఞానస్నానంనుండే ప్రభువుతో ఐక్యమౌతుంది. దీన్ని దివ్యసత్రసాదంతో పోషిస్తాం. ఇది పవిత్రాత్మకు ఆలయం, ఇది మళ్ళా ఉత్తానమై దేవుని సన్నిధిలో నిలుస్తుంది. ఇది ప్రభువుకి చెందింది. పవిత్రమైంది. ఈలాంటి శరీరాన్ని వ్యభిచారం మొదలైన అపవిత్ర కార్యాలతో అమంగళపరచకూడదు- 1కొ 6,13, ఉత్థానక్రీస్తూ అతని ఆత్మా మనమీద పనిచేసి ఈ లోకంలో మనం విశుద్ధంగా జీవించే భాగ్యం దయచేస్తారు. ఈ భాగ్యంకోసం మనం భక్తితో ప్రార్థించాలి.