పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మహాకార్యాలద్వారా తండ్రి క్రీస్తుని ప్రజలకు ఎరుకపరచాడు -2,22.తండ్రి అతన్ని మృతులలోనుండి లేపాడు -2-24. కనుక క్రీస్తుద్వారా తండ్రి పనిచేస్తున్నాడు. దేవుడు తన్ను తాను నరులకు ఎరుకపరచుకోవడాన్ని శ్రుతి (Revelation) అంటాం. ఈ శ్రుతి కేవలం బోధలు మాత్రమే కాదు, చేతలుకూడ. ఇక్కడ క్రీస్తు అద్భుతాలూ, మరణోత్ధానాలూ అతని చేతలు. క్రీస్తు చేసిన ఈ క్రియలద్వారా తండ్రి మనకు తెలియవస్తాడు. ఈలా తన బోధల ద్వారానూ చేతల ద్వారానూ క్రీస్తు తండ్రిని మనకు బయలుపరుస్తాడు.

2. పౌలు బోధలను తిలకిస్తే, అతడు తన జాబుల్లో పలుసార్లు “తండ్రి రహస్య ప్రణాళిక"ను గూర్చి మాటలాడుతూంటాడు - ఎఫె 19. ఆదాము పాపంద్వారా మానవ జాతి తండ్రినుండి దూరమైపోయింది. పిత క్రీస్తుద్వారా ఈ మానవజాతిని మళ్ళా తనతో రాజీపర్చుకోగోరాడు. క్రీస్తువచ్చి ఈ రాజీకార్యాన్ని నిర్వహించాడు. “తండ్రి రహస్య ప్రణాళిక" అంటే ఈ రక్షణ కార్యమే. ఇక, ఈ రక్షణ ప్రణాళికను నిర్వహించడంద్వారా క్రీస్తు తండ్రిని మనకు తెలియజేస్తాడు. అతన్ని రక్షణ ప్రణాళికా కర్తనుగా మనకు విశదపరుస్తాడు.

హెబ్రేయుల జాబు ఒక ముఖ్యమైన భావం చెప్పింది. పూర్వకాలంలో దేవుడు పెక్కుసార్లు, పెక్కు విధాలుగా ప్రవక్తలద్వారా మాట్లాడాడు. కాని ఈ కడపటి రోజుల్లో అతడు తన కుమారుని ద్వారానే మనతో మాట్లాడాడు -1, 1–2. పూర్వవేదంలో తండ్రి ప్రవక్తలద్వారా దివ్యశ్రుతిని తెలియజేసాడు. కాని అది అసంపూర్ణమైంది. అతడు నూత్న వేదంలో క్రీస్తుద్వారా మళ్ళా దివ్యశ్రుతిని తెలియజేసాడు. ఇది పరిపూర్ణమైంది. దీనిద్వారా మనం తండ్రిని చాలవరకు గ్రహిస్తాం.

3. తొలి మూడు సువిశేషాల్లోని బోధనలను పరికిస్తే శ్రుతినిగూర్చి చాల విషయాలు తెలుస్తాయి. క్రీస్తునాటి ప్రజలు అతన్ని “ప్రవక్త" అని పిల్చారు - మార్కు 6,15. అనగా అతడు తండ్రిని తెలియజేసేవాడనే ఆ ప్రజల భావం. క్రీస్తుకూడ తన బహిరంగబోధ ప్రారంభంలో "ప్రభువు ఆత్మ నా మీద వుంది. పేదలకు సువార్తను బోధించడానికి ప్రభువు నన్ను అభిషేకించాడు" అని చెప్పకొన్నాడు — లూకా 4,18. ఈ వాక్యాన్నిబట్టికూడ అతడు పితనుగూర్చి బోధించేవాడని అర్థంచేసికోవాలి.

మత్త 11,27లో ప్రభువు "కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రి నెరుగరు. మరియు కుమారుడు ఎవరికి యెరిగింప యిష్టపడతాడో వాళ్ళు మాత్రమే తండ్రిని యెరుగుతారు" అని పల్మాడు. ఇది చాల ముఖ్యమైన భావం. క్రీస్తు తెలియజేయందే ఏ నరుడూ తండ్రినిగూర్చి తెలిసికోలేడు, అనగా క్రీస్తు శ్రుతికర్త.