పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. క్రీస్తు దివ్యరూపధారణం

క్రీస్తు జ్ఞానస్నానం ప్రధానంగా అతని సిలువ మరణాన్ని సూచిస్తుంది. ఆలాగే అతని దివ్యరూపధారణం ప్రధానంగా అతని ఉత్థాన తేజస్సుని సూచిస్తుంది. అతని ఉత్ధాన తేజస్సు మనమీద సోకుతుంది. ఈ యధ్యాయంలో రెండంశాలు పరిశీలిద్దాం.

1. దివ్య రూపధారణ సంఘటన

మార్కు9,2-8 మత్త 17,1-18 లూకా 9, 28 -38 క్రీస్తు దివ్యరూపధారణాన్ని వర్ణించే ఆలోకనాలు. ఈ సంఘటనంలో చాలా అంశాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1. సందర్భం. క్రీస్తూ అతని శిష్యులూ ఫిలిప్పునకు చెందిన కైసరయ ప్రాంతంలో సంచరిస్తుండగా ప్రభువు నేనెవరినని మీ యభిప్రాయం అని ప్రశ్నించాడు. శిష్యులందరి తరపున పేత్రు నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువవు అని సమాధానమిచ్చాడు. అనగా అతడు రానున్న మెస్సీయా అని శిష్యులు నమ్మారని భావం - మత్త 16,16. అటుతర్వాత ప్రభువు తాను యెరూషలేములో మరణించి మళ్ళా పునరుత్తానమౌతానని శిష్యులకు తెలియజెప్పాడు - మత్త 16,21. తదనంతరం ఆరునాళ్ళు అయ్యాక అతడు కొండమీద మారురూపం తాల్చాడు. కనుక దివ్యరూపధారణ సంఘటనం అతని మరణోత్థానాలకు సంబంధించిందని అర్థం చేసికోవాలి.

2. కొండ. క్రీస్తు మారురూపం తాల్చింది తాబోరు కొండమీద అని పూర్వులు అభిప్రాయపడ్డారు. కాదు, హెర్మోను కొండమీద అని ఆధునికులు చెప్తున్నారు. బహుశ హెర్మోను కొండ అనడమే సబబుగా వుంటుంది. కైసరయూ మండలానికి చేరువలోవుంది హెర్మోను కాని తాబోరుకాదు. పైగా మార్కు 9,2 ఈ కొండ ఉన్నతమైనదని చెప్తుంది. తాబోరు చిన్నది, హెర్మోను ఎత్తయినది. క్రీస్తు నాడు తాబోరు కొండమీద ఓ ప్రాకారముండేది. కనుక సామాన్యులు దానిమీదికి వెళ్ళడానికి వీలుపడేదికాదు. ఈ కారణాలవల్ల క్రీస్తు ఎక్కింది హెర్మోను కొండే అనడం ఉచితం.

3. క్రీస్తు తేజస్సు క్రీస్తు పర్వతంమీద దివ్యరూపం ధరించి తండ్రిని దర్శించాడు. ఈ వదంతానికి తుల్యమైన సంఘటనలు రెండు పూర్వవేదంలో వున్నాయి. పూర్వం మోషే సీనాయి కొండమీది కెక్కిపోయి దేవుణ్ణి దర్శించాడు. అక్కడ దేవుని తేజస్సుతో వెలిగిపోయాడు - నిర్గ 24, 15 -18. అలాగే యేలియా ప్రవక్తకూడ హోరేబు కొండమీద దేవుణ్ణి దర్శించాడు - 1,రాజు 19, 8-14. ఈ మహాభక్తుల్లాగే ఇక్కడ ప్రభువుకూడ దేవుణ్ణి సాక్షాత్కారం చేసికొన్నాడు.