పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2.ప్రభువు సొంత పేరు యేసయితే, అతని బిరుదం క్రీస్తు. క్రీస్తు అనేది గ్రీకుమాట. దీనికి తుల్యమైన హీబ్రూపదం "మషీహా". దీన్నే మనం తెలుగులో మెస్సీయా అంటాం. మషీహా అంటే అభిషేకం పొందినవాడని అర్థం. అనగా తండ్రి తన కుమారుడికి అభిషేకంచేసి అతన్ని తనసొంత పనిమీద పంపాడని భావం. హీబ్రూ సంప్రదాయం ప్రకారం అభిషేకం పొందడమంటే ఒక పనిలో నియుక్తుడు కావడం. కనుక తండ్రి క్రీస్తుని రక్షణకార్యంలో నియుక్తుణ్ణి చేసాడు అని చెప్పాలి. పూర్వవేదంలో రాజులు యాజకులు తప్పనిసరిగాను, ప్రవక్తలు అరుదుగాను అభిషేకం పొందేవాళ్ళు. ఇక, క్రీస్తుని అనుసరించేవాళ్లు క్రైస్తవులు ("క్రీస్తువులు" అనకూడదు) - అ.చ. 11,26. మనం క్రీస్తు పేరుమీదిగా పిల్వబడేవాళ్ళం. ఈ పేరునకు మనమెంతో గర్వించాలి.

3.మషీహా లేక క్రీస్తు లేక అభిషిక్తుడు అంటే తండ్రి వలన అభిషేకం పొందినవాడని చెప్పాం. క్రీస్తు అభిషేకాలు మూడున్నాయి. మొదటిది, అతడు మనుష్యావతారమెత్తిన సమయంలో యాజకుడుగా అభిషిక్తుడయ్యాడు. ఇక్కడ పవిత్రాత్మ క్రీస్తు మానుష దేహానికి అభిషేకం చేసి దాన్ని దైవవార్తతో జోడించింది. దీని ఫలితమే మనుష్యావతారం - హెబ్రే 17-18. రెండవది, జ్ఞానస్నాన సమయంలో పవిత్రాత్మ అతన్ని ప్రవక్తగా అభిషేకించింది - మత్త 3, 16 అచ, 4,27, 10,38. మూడవది, ఉత్థాన సమయంలో తండ్రి అతన్ని రాజుగా అభిషేకించాడు - అ.చ. 2,36. హెబ్రే 1,9. నేడు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు మనమూ అతని మూడభిషేకాల్లోను పాలుపొందుతాం. అతనిలాగే మనమూ యాజకులమూ, ప్రవక్తలమూ, రాజులమూ ఔతాం. ఈ భాగ్యానికి మనం ఆ ప్రభువుకి నమస్కారం చెప్పాలి.

4.ప్రభువు తన బహిరంగ జీవిత ప్రారంభంలో "ప్రభువు ఆత్మనా మీదికి దిగివచ్చింది. అతడు పేదలకు సువార్త బోధించడానికి నన్నభిషేకించాడు" అని చెప్పకొన్నాడు - లూకా 4,18. ఇది పూర్వవేదంలో యెషయా ప్రవక్త తన్ను గూర్చి చెప్పకొన్న వాక్యం - 61, 1-2. అక్కడ పవిత్రాత్మ ప్రవక్తను అభిషేకించినట్లే ఇక్కడ క్రీస్తునికూడ అభిషేకించింది. దీని ఫలితంగానే క్రీస్తు బహిరంగ బోధకు పూనుకొన్నాడు. నేడు క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన భక్తులకుగూడ బోధనా సామర్థ్యాన్ని ప్రసాదించేది ఆ యాత్మే కనుక మనంకూడ ఆ యాత్మనుండే ఈ వరాన్ని అడుగుకోవాలి.