పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనమే. మనం క్రీస్తుతో ఐక్యమై ఆరాధన సమాజంగా, ఆరాధన మందిరంగా నిర్మితులమౌతాం. ఆ సమాజంలో, ఆ మందిరంలో, క్రీస్తూ మనమూ కలసి తండ్రిని అర్చిస్తాం. ఈలా పూర్వవేదారాధనకు బదులుగా ఈ నూతవేదారాధనం కొనసాగిపోతుంది.

అంతేకాదు, క్రీస్తుతో ఐక్యమై ఓ భవనంలా, ఓ సమాజంలా వున్న మనం, ఒకరికొకరం సాయపడాలి. ఒకరినొకరం నిర్మించుకోవాలి. మనం పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించుకోవాలి - రోమా 14,19.

ఫలితాంశమేమిటంటే, క్రీస్తూ అపోస్తలులూ మనమూ అందరం కలసి శ్రీసభ అనే భవనాన్ని నిర్మిస్తాం. ఈ నిర్మాణంలో ఎవరిపాత్ర, బాధ్యత వాళ్ళకుంటుంది. మనంకూడ మనవంతు పనిని చేయాలి, యావే ప్రభువు పూర్వవేదంలో యిస్రాయేలు సమాజాన్ని నిర్మించాడు. ఆ యిప్రాయేలు సమాజం పొడిగింపే నేటి క్రైస్తవ సమాజం.

ప్రార్ధనా భావాలు

1. ఈ యధ్యాయంలో దేవుడు గృహనిర్మాత, దేవుని ప్రజలు అతడు నిర్మించిన గృహం అని చెప్పాం. ఈ గృహం దేనికి? దేవుడు ఈ గృహంలో వసిస్తాడు. మనమందరం క్రీస్తుతో గలసి ఒక్కగృహమౌతాం. దానిలో దేవుడు తన ఆత్మద్వారా నివసిస్తాడుఎఫే 2,32. కనుక అది పవిత్ర గృహం, అదే క్రైస్తవ సమాజం.

2. ఏయే శక్తులు ఈ గృహాన్ని నిర్మిస్తాయి? సోదరప్రేమ ఈ గృహాన్ని నిర్మిస్తుంది - 1కొ, 8,1. ఈనాటివరకు కొనసాగుతున్న అపోస్తలుల బోధ ఈ భవనాన్ని నిర్మిస్తుంది –2,7. ప్రార్థన ఈ మందిరాన్ని నిర్మిస్తుంది - యూదా జాబు 20. కనుక మనం సోదరప్రేమ, అపోస్తలుల బోధ, ప్రార్ధనం మొదలైన వాటన్నిటిద్వారా ఈ గృహాన్ని పెద్దదిగా చేసికొంటూపోవాలి.

3. ఏయే శక్తులు ఈ గృహాన్ని నాశంచేస్తాయి? క్రీస్తు నుండీ అపోస్తలులనుండీ వచ్చిన పవిత్ర బోధను తారుమారుచేస్తే ఈ భవనం నాశమౌతుంది. కనుకనే యూదా జాబు "మీరు పరమ పవిత్రమైన మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసికొనండి" అని చెప్తుంది -2. "మీకు బోధించిన విధంగా మీ విశ్వాసాన్ని నానాటికి పెంపొందించుకోండి" అని హెచ్చరించాడు పౌలు - కొలో 2,7. అతడు మనకందరికీ విశ్వాస విషయంలో ఐక్యత వుండాలి” అనికూడ చెప్పాడు - ఎఫె 4,13.

ఇంకా అనైతిక ప్రవర్తనం ఈ భవనాన్ని నాశం చేస్తుంది. అనగా మనలో ఐక్యత పరస్పర ప్రేమ మొదలైనవి కుంటుపడి పోకూడదు. కనుక ఈ యంశాలన్నిటిలోను మనం జాగ్రత్తగా మెలగాలి. "మనలో ప్రతి వ్యక్తియు తన సోదరుని ప్రేమనీ క్షేమాభివృద్ధినీ పెంపొందించాలి” అన్న పౌలు వాక్యం మనకు ఆదర్శం కావాలి - రోమా 15,2. మన వ్యక్తిగత జీవితంలోగూడ మనమెప్పడూ ధ్వంసాత్మకంగా గాక నిర్మాణాత్మకంగా ప్రవర్తిస్తుండాలి.