పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ తోటకాపు కొడుకునే చంపివేస్తారు - మార్కు 12, 1-12. ఇంకా అతడు ద్రాక్షతోటలో పనిచేసిన కూలీల కథ చెప్పాడు - మత్త 20,1-16. తండ్రి ద్రాక్షతోటకు పంపగోరిన ఇద్దరు కుమారుల కథ చెప్పాడు. ఇక్కడ పెద్దవాడు తోటకు వెళ్ళి పనిజేసాడు, చిన్నవాడు వెళ్ళనేలేదు - మత్త 21, 28-32. ఈ వుపమానాలన్నిటిలోను ద్రాక్షతోట నూత్నవేద ప్రజలను తలపుకు తెస్తుంది.

తొలి మూడు సువిశేషాల భావాలు పూర్వవేద భావాల వంటివే. అనగా పూర్వవేద ప్రజల్లాగ నూతవేద ప్రజలు కూడ దేవుని తోటే అతడు ఆ తోటను ఆదరంతో జూస్తాడు.

4. నాల్గవ సువిశేషం భావాలు

యోహాను సువిశేషంలోని భావాలు తొలి మూడు సువిశేషాల భావాలకంటె భిన్నంగా వుంటాయి. అతడు ద్రాక్షతీగ - దానిలోనికి అతుక్కొన్నకొమ్మలు అనే వుపమానం చెప్పాడు. క్రైస్తవులు క్రీస్తు శరీరంలోకి అతుక్కొన్న అవయవాల్లాంటివాళ్ళని దీని భావం, ఇది బైబుల్లో నూత్నభావం. కనుక ఇక్కడ యోహాను భావాలను జాగ్రత్తగా పరిశీలిద్దాం.

యోహాను మొదటి భావం ఇది. తండ్రి నాటిన ద్రాక్షతోట క్రీస్తే, అతడు నిజమైన యిస్రాయేలు. పూర్వపు యిస్రాయేలు అనే తోట చెడ్డది కనుక మంచి పండ్లు పండలేదు. కాని క్రీస్తనే తోట తండ్రికి మంచి పండ్లు పండుతుంది. దానికిగాను తండ్రి క్రీస్తనే ద్రాక్షతోటను కత్తిరించి సరిచేస్తాడు. ఈ కత్తిరింపే క్రీస్తు సిలువ మరణం. అతడు తన మరణికోత్తానాలద్వారా మనకు పాపపరిహారాన్నీ వరప్రసాదాన్నీ సంపాదించి పెట్టాడు. ఇవే క్రీస్తులత కాచిన మంచి ఫలాలు - యోహా 15,1-2. ఇంతవరకు యోహానుగూడ పూర్వవేద భావాలనే అనుసరించాడు. అనగా తండ్రి తోట కాపు. ప్రజలకు మారుగా క్రీస్తే అతడు నాటిన నిజమైన తోట.

ఇక, యోహాను రెండవ భావం ఇది.బైబుల్లో ఇంతవరకు కన్పింపని క్రొత్తభావం ఇక్కడే కన్పిస్తుంది. కనుక ఇది చాల ముఖ్యమైంది. క్రీస్తు ద్రాక్షలతలాంటివాడు. మన ఆ లతలోనికి అతుక్కొన్న చిన్నచిన్న రెమ్మల్లాంటివాళ్లం, విశ్వాస జ్ఞానస్నానాలద్వారా మనం క్రీస్తులోనికి ఐక్యమై, అతని అవయవాలమౌతాం. క్రీస్తనే తీగలోనికి రెమ్మల్లాగ అతుక్కొని పోవడమంటే యిదే. ఈ భావాన్నే పౌలు క్రీస్తు దేహంలాంటివాడు, మనం అతని అవయవాల్లాంటి వాళ్ళం అన్న వుపమానంలో వివరించాడు.

ఈలా క్రీస్తనే తీగలోనికి రెమ్మల్లాగ అతుక్కొని పోవడంవల్ల, తల్లి చెట్టులోనిసారం కొమ్మల్లోనికి వచ్చినట్లుగా, క్రీస్తు సారం మనలోకి ప్రసరిస్తుంది. ఈ సారమే క్రీస్తు 'వరప్రసాదం. ఈ వరప్రసాదాన్ని పొంది మనం దివ్యజీవితం గడుపుతాం.