పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్షణ ప్రణాళికలో మొదటిమెట్టు అతని జ్ఞానస్నానం. ఈ సంఘటనంతో అతడు పిత ప్రణాళికను సాధించడానికి పూనుకొన్నాడు - మత్త 3,15. ఇంకా మెస్సీయా రక్షడోద్యమం పశ్చాత్తాపంతో ప్రారంభమౌతుంది. క్రీస్తు జ్ఞానస్నానంలో ఈ పశ్చాత్తాపం వుంది. యోహాను యిచ్చిన జ్ఞానస్నానంలో ముఖ్యాంశం ఈ పశ్చాత్తాపమే. కనుక క్రీస్తు జ్ఞానస్నాన సంఘటనంతోనే తన రక్షణోద్యమాన్ని ప్రారంభించవలసి వచ్చింది.

క్రీస్తు తనకోసం జ్ఞానస్నానం పొందలేదు. అతడు పాపరహితుడు. అతని జ్ఞానస్నానం మనకోసం. నూత్న మానవజాతికి అతడు శిరస్సు. క్రీస్తు జ్ఞానస్నానం పొందినపుడు అతని అవయవాలమైన మనంకూడ అతనియందు జ్ఞానస్నానం పొందాం. అతని పశ్చాత్తాపం మన పశ్చాత్తాపమైంది. ఈ విధంగా అతని జ్ఞానస్నానం మన జ్ఞానస్నానాన్ని సూచిస్తుంది.

2. పిత ఆత్మల సాక్ష్యం

ఇక్కడ మూడంశాలను పరిశీలించాలి. 1. క్రీస్తు జ్ఞానస్నానం పొందినపుడు "ఇతడు నా ప్రియకుమారుడు, ఇతనినిగూర్చి నేను ఆనందిస్తున్నాను" అని ఆకాశంనుండి ఓ స్వరం వినిపించింది - మత్త 3,17. ఇది క్రీస్తు తరపున పితపలికిన సాక్ష్యం. ఈ వాక్యానికి యెషయా ప్రవచనం 42, 1 ఆధారం. అక్కడ బాధామయసేవకుడు ప్రభువు నిర్ణయించిన రక్షణకార్యాన్ని నెరవేరుస్తాడు. కనుక ప్రభువు ఆ సేవకుణ్ణిజూచి ఆనందించాడు. ఆ బాధామయ సేవకుడు క్రీస్తే. కనుక తండ్రి ఆ బాధామయ సేవకుణ్ణి గూర్చిన వాక్యంతోనే యిక్కడ క్రీస్తుకి సాక్ష్యం పలికాడు. ఇంకా ఈ క్రీస్తు తండ్రికి ప్రతిబింబం. అతని వెలుగు, అతని కుమారుడు. అతని రక్షణోద్యమాన్ని సాధించడానికి వచ్చినవాడు. తండ్రి సంకల్పాన్ని పాటించడమే ఈ క్రీస్తుకి ఆహారం. అలాంటి కుమారుని జ్ఞానస్నానాన్నిచూచి తండ్రి ఆనందించడంలో ఆశ్చర్యమేమీలేదు. ఈ ఆకాశస్వరాన్ని వినడం వల్ల స్నాపక యోహానుకి కూడ క్రీస్తుపట్ల నమ్మకం కలిగింది. తాను అతన్ని మెస్సీయాగా అంగీకరించాడు.

2. జ్ఞానస్నానం పొందిన క్రీస్తు మీదికి దేవుని ఆత్మపావురం లాగ దిగివచ్చింది. ఈలా దిగిరావడం ఆత్మపలికిన సాక్ష్యంగా భావించాలి. బైబుల్లో ఆత్మ ప్రధానంగా శక్తిని సూచిస్తుంది. ఈ ఆత్మద్వారా క్రీస్తుకి తన రక్షణోద్యమానికి కావలసిన శక్తి అనుగ్రహించబడింది. ఈ శక్తినే బైబులు "అభిషేకం" అని పిలుస్తుంది - అచ 10,38. మెస్సీయా కాలంలో ప్రభువు అందరిమీద తన ఆత్మను కుమ్మరిస్తాడు అని ప్రవక్తలు చెప్పారు - అ, 2.17. ఇక్కడ ఆత్మ మొట్టమొదట క్రీస్తుమీదనే కుమ్మరింపబడింది. ఫలితాంశమేమిటంటే, జ్ఞానస్నానానంతరం క్రీస్తుకి ఆత్మ అనుగ్రహం సమృద్ధిగా లభించింది.