పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలి ఆదాము సజీవిగ సృజింపబడ్డాడు. అంటే తన కొరకు తాను ప్రాణం పొందాడు. మనకు గూడ భౌతిక ప్రాణం అందించాడు. కాని రెండవ ఆదాము మనకిచ్చింది ఇంకా గొప్ప జీవితం. అతడు ఉత్దానుడైన మనకు ఆత్మను దయచేసాడు. మనకు ఆధ్యాత్మిక జీవాన్ని వరప్రసాద జీవాన్ని ప్రసాదించాడు.

మొదటి ఆదాము భౌతిక సృష్టి మట్టితో చేయబడినవాడు. బలహీనపు ప్రాణి. పాపం చేసేవాడు. నాశమైపోయేవాడు. రెండవ ఆదాము ఆధ్యాత్మిక సృష్టి దివినుండి వచ్చేవాడు. నాశం లేనివాడు. అతడు ఉత్థానం చెంది తన ఆత్మను మనకు ప్రసాదించేవాడు. తొలి ఆదాము మనకు భౌతిక జీవం మాత్రమే ఈయగలవాడు. కాని రెండవ ఆదాము మనకు ఆధ్యాత్మిక జీవం దయచేస్తాడు.

మొదటి ఆదామును పోలివుండే మనం నాశానికి గురౌతాం. కాని రెండవ ఆదామును పోలివుండే మనం రక్షణం పొందుతాం. ఫలితాంశమేమిటంటే, ఆదాము బిడ్డలమూ నాశానికి గురయ్యే వాళ్ళమూ ఐన మనం, క్రీస్తుని ధరించి దివ్యత్వాన్ని పొందుతాం.

రోమా. 5,12-21లో గూడ పాలు ఇద్దరు ఆదాములకు వ్యత్యాసాన్ని చూపించాడు. ఇక్కడ పౌలు క్రీస్తు ద్వారా మనకు రక్షణం లభిస్తుందనే అంశాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు.

ఆదాము రానున్నవానికి, అంటే క్రీస్తుకి, చిహ్నంగా వుంటాడు. క్రీస్తు ఆదాములో ఇమిడే వున్నాడు. క్రీస్తు నరుడై జన్మించినపుడు ఈ చిహ్నం నెరవేరింది - 14,

ఆదాము పాపం అవిధేయత, దానివల్ల మనకందరికీ పాపమూ మృత్యువూ దాపురించాయి. క్రీస్తు విధేయత వల్ల ఆదాము పాపానికి పరిహారం చెల్లించినట్లయింది. అతని విధేయత మనలను నీతిమంతులనూ జీవమయులనూ చేసింది - 19,

ఆదాము ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. దానివలన మనకు మృత్యువు గూడ సిద్ధించింది. కాని క్రీస్తు నీతియుతమైన క్రియ మనకందరికీ విముక్తిని ప్రసాదించింది. ఆదాము ద్వారా మనం పోగొట్టుకొన్నదానికంటె క్రీస్తు ద్వారా మనం పొందిందే యెక్కువ. కావున ఒక విధంగా చెప్పాలంటే, ఆదాము పాపం చేయడమే మెరుగైంది - 18.

ఆదాము ఏవతో కలసి పాపం చేసాడు. క్రీస్తు తిరుసభను రక్షించి ఆమెను తన పత్నినిగా జేసికొన్నాడు. నేడు ఈ క్రీస్తు తిరుసభల పోలిక మన క్రైస్తవ వివాహంలో వధూవరులపై సోకుతుంది.

ఈలా ఆదాము పాపం వలన నాశమైపోయిన మానవజాతిని క్రీస్తు తన మరణం " ద్వారా రక్షించాడు,