పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. నూత్న ఆదాము

నూత్నవేదంలో క్రీస్తుకి నూత్న ఆదాము అని పేరు. అతడు తొలి ఆదాముకి పోలికగా ఉంటాడు. కనుక ఇక్కడ ఈ ఇద్దరు ఆదాముల చరిత్రలు పరిశీలిద్దాం.

1. తొలి ఆదాము

ఆదాము అనే పేరు “ఆద్మా' అనే హీబ్రూ మాట నుండి వచ్చింది. ఆ భాషలో ఈ శబ్దానికి మట్టి అని అర్థం. కనుక ఆదాము అనే పేరుకి దుర్బలప్రాణి, నాశమయ్యే వాడు, మట్టిలో కలసిపోయేవాడు అని అర్థం. కనుకనే దేవుడు ఆదాముతో "నీవు మట్టినుండి పుట్టావు, చివరకు మట్టిలోనే కలసిపోతావు” అని చెప్పాడు - ఆది 3,19.

ఆదాము అనే మాటకు నరుడు అనే అర్థమూ వుంది, మానవజాతి అనే అర్ధమూ వుంది - ఆది 1,26. ఏవ భర్తయైన ఆదాము అనే ప్రత్యేక వ్యక్తి అనీ అర్థముంది - ఆది 3,21. మనం మొదట ఈ ప్రత్యేక వ్యక్తియైన ఆదాముని గూర్చి పరిశీలిద్దాం. ఇతడే ఏవ భర్త, కయీను ఆబేలుల తండ్రి, మానవజాతినంతటినీ తనలో ఇముడ్చుకొనినవాడు.

దేవుడు నేలమట్టిని తీసికొని దానిలోనికి తన ఊపిరిని ఊదగా మట్టి నరుడయింది. అతడే తొలి ఆదాము - ఆది 2.7. అతనికి తోడుగా, భార్యగా వుండడానికి దేవుడు ఏవను చేసాడు - 2,18. ఈ s పురుషులిద్దరిలోను దేవుని పోలిక వుంది - 1,27.

ఈ ఆదాము, అతని భార్యయైన ఏవ దేవుడు తినవద్దన్న చెట్టుపండు తిని పాపం చేసారు - 3,6, ఆదాములో మనమందరం ఇమిడివున్నాం, అతడు మానవజాతి కంతటికీ శిరస్సు. కనుక అతని పాపం మానవులందరికి సంక్రమించింది. దీనినే మనం నేడు "జన్మపాపం" అంటాం. ప్రాచీనకాలంలోనే కీర్తనాకారుడు ఈ పాపాన్ని గూర్చి చెపూ"నేను పట్టినప్పటినుండీ పాపాత్ముడనే" అని వాకొన్నాడు - కీర్త51,6. ఆదామునుండి మనకు పాపం సంక్రమించిందన్న భావం మానవజాతిలో ఆదిమకాలం నుండి వుంది. అలాగే ఆదిమకాలం నుండి గూడ ఒక రక్షకుడు వచ్చి మనలను ఈ పాపం నుండి కాపాడతాడనే భావం కూడ మానవలోకంలో ప్రచారంలో వుంది. తొలి పాపానంతరం ప్రభువు పామరూపంలో వున్న పిశాచంతో ఈలా అన్నాడు :

"నీకును స్త్రీకిని
నీ సంతతికిని స్త్రీ సంతతికిని
తీరని వైరం కలుగుతుంది
ఆమె సంతానం నీ తలను చితుకగొడతారు
నీవేమో వారి మడమలు కరుస్తావు"