పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

- కీర్త25,8–9. ఆ ప్రభువు దయాళుడు. పాపాత్ముడు నాశమైపోవాలని అతడు ఏనాడూ కోరుకోడు. పాపి పరివర్తనం చెంది మళ్ళా బ్రతకాలనే అతని తలంపు

- యేహె 33, 11. కనుక మనం మన పాపాలకు పశ్చాత్తాపపడి మల్లా ప్రభువు మార్గాల్లో నడవడానికి పూనుకొంటుండాలి.

2.కీర్తనకారులు తమకు ధర్మమార్గాన్ని చూపించమని ప్రభువుని వినయంతో అర్ధించారు.

"ప్రభూ! నీ మార్గాలను నాకు తెలియజేయి
నేను నమ్మదగినతనంతో నీ త్రోవలో నడిచేలా చేయి
పూర్ణ హృదయంతో నిన్ననుసరించేలా చేయి" - 86,11
"ప్రభువుకి భయపడేవాళ్ళ
తాము నడువవలసిన త్రోవను
అతనినుండే తెలుసుకొంటారు" - 25,12.

కనుక మనం కూడ మంచిమార్గాన్ని చూపించమని ప్రభువుని నిరంతరం వేడుకొంటూండాలి.

3.దైవవాక్యం కూడ మనకు ప్రధాన మార్గాల్లో వొకటి. కావననే కీర్తనకారుడు

“నీ వాక్యం నా పాదాలకు దీపం
నా త్రోవకు వెలుగు"

అని నుడివాడు - కీర్త 119,105. మనం రోజూ ఓ పావుగంట కాలం ఈ దైవవాక్కుని భక్తితో మననం చేసికోవాలి. అప్పడు దేవుని మార్గాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి.

4.క్రీస్తుని అనుసరించేవాళ్ళు క్రైస్తవులు. ప్రభువు ఉత్తానానంతరం అతని భక్తులను క్రైస్తవులు అని పిల్చారు. అంటియోకయలో శిష్యులను మొదటిసారిగా ఈ పేరుతో పిల్చారు - అ,చ,11,26, అప్పటినుండి మనకీ పేరు చెల్లుతూ వస్తూంది. క్రీస్తు ప్రభువు మనకు మార్గమూ గురువూ ఐనందులకు మనమెంతో సంతోషించాలి. పూర్వవేద మార్గం ధర్మశాస్త్రం. కాని నూత్నవేద మార్గం నిర్జీవమైన ధర్మశాస్త్రం కాదు, సజీవ వ్యక్తియైన ఉత్థాన క్రీస్తే మనకు త్రోవ. అతడు తన ఆత్మ ద్వారా నేడు మనలను చైతన్యవంతులను చేస్తూంటాడు. యూదులు అన్యులూ క్రైస్తవులూ అందరూ కూడ ఈ క్రీస్తనే త్రోవగుండానే ఒకే ఆత్మద్వారా తండ్రిని చేరుకోవాలి = ఎఫి 2,18.