పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13,30. ఇక్కడ రేయి పిశాచానికి చిహ్నం గనుక యూదా పూర్తిగా పిశాచం వశంలో వుండిపోయాడని భావం. ఇంకా, అతడు క్రీస్తుని పట్టియిచ్చిన వేళకూడ అంధకార శక్తితో కూడింది - లూకా 22,53. కాని, క్రీస్తు మాత్రం మరణానంతరం సజీవుడై లేచి ఎల్లరికీ రక్షణ జ్యోతిని వెల్లడిచేస్తాడు - అచ 26,23.

8. క్రీస్తుని విశ్వసించేవాళ్ళు వెలుగు

ప్రభువు వెల్తురుగా లోకంలో అవతరించాడు. దుష్టవర్తనులు కాదుగాని సద్వర్తనులు ఆ పరంజ్యోతిని సమీపించి అతనిలాగే తామూ జ్యోతిర్మూర్తులుగా మారిపోతారు- యోహా 3,19. క్రీస్తుని విశ్వసించేవాళ్ళు ప్రకాశవంతులు, అతన్ని నిరాకరించేవాళ్లు తమోమయులు, ఇహలోక మానవులు. మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందగానే అతని వెల్లురు మనలో ప్రకాశించడం మొదలుపెడుతుంది. ఆ సమయంలోనే తండ్రి మనలను అంధకార శక్తినుండి విడిపించి తన ప్రియపుత్రునికి చెందిన వెలుగు సామ్రాజ్యం లోనికి పిలుస్తాడు - కొలో 1,12-13. జ్ఞానస్నానం ద్వారా తండ్రి మనలను చీకటిలో నుండి అద్భుతమైన వెలుగులోనికి పిలుస్తాడు - 1పే 2,9. జ్ఞానస్నానానికి పూర్వం మనమంతా చీకటిలో వుండేవాళ్ళమే. కాని ఈ సంస్కారానంతరం మనం దైవప్రజలమై వెలుగులో వుంటాం. కనుక మనం వెలుగునకు సంబంధించిన ప్రజల్లాగే జీవించాలి - ఎఫె 5,8.

9. మన నైతిక జీవితం వెలుగుతో నిండివుండాలి

వెలుగుకు సంబంధించిన మనం ఆ వెలుగునకు తగిన జీవితమే జీవించాలని చెప్పాం. ఎంతచెట్టుకి అంతగాలికదా! మనం చీకటికి చెందిన పనులను మానివేసి, వెలుతురులో జీవించే ప్రజలంగా సత్ర్పవర్తనం అలవర్చుకోవాలి - రోమా 13,12. పాపకార్యాలను వదలి పుణ్యకార్యాలను సాధించాలి. ఈ సాధనాన్నే యోహాను "వెలుగులో నడవడం" అని వాకొన్నాడు - 1యోహా 1,7. ఈలా వెలుగులో నడిచేవాళ్ళ ప్రధాన లక్షణం సోదర ప్రేమ. తోడి నరుణ్ణి ప్రేమించేవాళ్లు వెలుగులోను, అతన్నిద్వేషించేవాళ్లు అంధకారంలోను ఉన్నారు అనుకోవాలి - 1యో 2,10-11.

మనతరపున మనం వెలుగు కలవాళ్ళమైతే ఇతరులకు కూడ వెలుగును చూపిస్తాం. కనుకనే క్రీస్తు "మీరు లోకానికి వెలుగై యున్నారు. మీ వెలుగుని ప్రజల యెదుట ప్రకాశింపనీయండి" అని చెప్పాడు - మత్త 5,14-16. ఈలా ఇతరులకు క్రీస్తు వెలుగుని చూపించడమే మన ప్రేషిత సేవ.