పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘటనల ద్వారా తాము యావే భక్తుల మయ్యామని యెంచారు. తాము ప్రభువుకి యాజకరూపమైన రాజ్యమూ పవిత్ర ప్రజా ఆయ్యామని భావించారు - 19,6.

నూత్నవేదం క్రీస్తు మన పాస్కగొర్రెపిల్ల అని చెప్తుంది. ఆ పాస్క గొర్రెపిల్లలాగే క్రీస్తు కూడ నిష్కళంకమైన గొర్రెపిల్ల – 1షేత్రు 1,19. పాస్క గొర్రెపిల్ల అవలక్షణాలు లేనిది - నిర్గ 12,5. అలాగే క్రీస్తు కూడ పాపం లేనివాడు. ఈ నిష్కళంకమైన గొర్రెపిల్ల ఆ పాస్క గొర్రెపిల్లలాగే మన కొరకు బలియై మనకు విముక్తి కలిగిస్తుంది. ఈ బలిద్వారానే మనం దేవునికి నివేదితులమౌతాం. ఎన్నుకొనబడిన జాతి, రాజగురుకులం, పవిత్రప్రజ, దేవుని సొంతప్రజ ఔతాం - 1పేత్రు 2,9. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆధ్యాత్మిక బలులనర్పిస్తాం - 2,5. చీకటినుండి అద్భుతమైన వెలుగులోనికి ప్రయాణం చేస్తాం - 2,9. ఇది మన నిర్గమనం.

యెరూషలేములో యూదులు శుక్రవారం సాయంత్రం పాస్క గొర్రెపిల్లలను వధించేవాళ్ళు. వాటితో శనివారం పాస్మపండుగ జరుపుకొనేవాళ్ళ వాళ్ళు శుక్రవారం సాయంత్రం దేవళంలో గొర్రెపిల్లలను వధించేపుడు మన గొర్రెపిల్లమైన క్రీస్తుని గూడ నగరం వెలుపల కొండ మిద వధించారు - యోహా 19,14-16.

క్రీస్తుని సిలువ వేసాక అతని కాళ్ళు విరుగగొట్టలేదు - యోహా 19,33. యూదులు పాస్క గొర్రెపిల్లను భుజించేపుడు దాని యెముకలు విరుగగొట్టగూడదు అనే నిషేధం వుంది - నిర్గ 12,46. ఈ నిషేధం ఇక్కడ క్రీస్తుపట్ల నెరవేరింది. ఈలా ఈ నూత్నవేద వాక్యాలన్నీ క్రీస్తు మన పాస్క గొర్రెపిల్ల అని సూచిస్తాయి.

3. మోక్షపు గొర్రెపిల్ల

బైబుల్లో చివరి పుస్తకమైన దర్శన గ్రంథం క్రీస్తుని మోక్షపు గొర్రెపిల్లనుగా వర్ణిస్తుంది. క్రీస్తు గొర్రెపిల్ల వధకు పూర్వం బలహీనమైంది. కాని వధింపబడి ఉత్థానమైనయనంతరం అది సింహం లాగ మహాబలసంపన్నమైన దవుతుంది. యూదా గోత్రపు సింహమైన క్రీస్తు మనలను దాస్యం నుండి విడిపిస్తాడు - దర్శ 5,5-6. ఆ మోక్షపు గొర్రెపిల్ల దేవుని సింహాసనాన్నెక్కుతుంది - 7, 17. దుర్మార్గులు ఆ గొర్రెపిల్లను జూచి గడగడ వణకుతారు - 6,16. కడన ఆ గొర్రెపిల్ల మోక్ష వాసులందరికీ కాపరీ నాయకుడూ ఐ వారిని జీవజలాలకు నడిపించుకొనిపోతుంది - 7,17. ఈ వాక్యాలన్నింటిలోను గొర్రెపిల్ల క్రీస్తే. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లుగా కన్పిస్తుంది - 5,6. క్రీస్తుని సిలువమిద వధించారు కదా! ఇంకా ఆ గొర్రెపిల్ల జగదుత్పత్తికి ముందటినుండి వధింపబడివుంది - 13,8. అనగా జగదారంభం నుండే తండ్రి క్రీస్తు బలిని నిర్ణయించాడు. పూర్వవేద బలుల్లోకూడ క్రీస్తుబలి ప్రత్యక్షమై వుంది.