పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంలో పితృపాదులు కొన్ని గొప్పభావాలు చెప్పారు. క్రీస్తు దేహధారణం అవసరంకాదు. కాని ఈ దేహధారణంవల్ల మనలను మనమే రక్షించుకోవడానికి అనుకూలంగా వుంటుంది. ఆ ప్రభువు ఆదాము సంతతివాడే గనక కాకపోయినట్లయితే ఆదాము సంతతికి రక్షణం కలిగి వుండేదేకాదు. సుతుడు మనుష్యుడు కాకుండానే తండ్రి ఆదాము పాపాన్ని మన్నించి వుండవచ్చు. కాని అటుతరువాత మానవులు మల్లా చేసే పాపాలకు పరిహారమార్గం ఏమిటి? మానుష దేవుడే గనుక మనమధ్యలోవుంటే అతని నుండి మాటిమాటికీ పాపపరిహారం పొందవచ్చు. ఈ కారణాలన్నింటివల్ల దేవుడు నరుడయ్యాడు.

4. ఇచ్చిపుచ్చుకోవడం

దేవుడు నరుడైంది నరుడ్డి దేవుణ్ణి చేసేందుకు. దేవుడు మన నరజాతినుండి మనుష్యత్వాన్ని చేకొన్నాడు. దానికి బదులుగా మనకు దైవత్వాన్ని ప్రసాదించాడు. ఇది యిచ్చిపుచ్చుకోవడం. ఈ క్రియద్వారా క్రీస్తకంటెగూడ మనకే యెక్కువ లాభం చేకూరింది. నరులు ఎన్నాళ్ళబట్లో దైవత్వాన్ని పొందాలని ఉబలాటపడుతూవచ్చారు. కాని మనంతట మనం ఈ కోర్మెను తీర్చుకోలేం. అందుకే ఆ ప్రభువు తానుస్వయంగా వచ్చి మనకు ఈ వరాన్ని ప్రసాదించాడు. నరునికి దివ్యత్వాన్ని దయచేసి అమరలోకంలోకి తీసికొని పోయాడు.

సుతుడు నరుడై జన్మించినపుడు ఓ ప్రత్యేకమైన నరదేహాన్ని మాత్రమేకాదు, మన నరత్వమంతా చేకొన్నాడు. అలా చేకొనందే మన నరజాతికి పాపవిముక్తి కలిగేదికాదు. తాను చేకొన్న ఈ నరత్వానికి బదులుగా అతడు నరులందరికీ - అనగా తన్ను విశ్వసించేవాళ్ళందరికీ - దివ్యత్వాన్ని ప్రసాదించాడు. అతడు తన్నంగీకరించే వాళ్ళందరికి దేవుని బిడ్డలయ్యే శక్తిని దయచేసాడు - యోహా 1,12. ఇక్కడ దేవునిబిడ్డలం కావడమంటే దైవత్వాన్ని పొందడమే.

5. దైవకృప ప్రత్యక్షమైంది

నరవతారంద్వారా అదృశ్యుడైన దేవుడు దృశ్యుడయ్యాడు. సమస్త జనుల రక్షణం కొరకు దైవకృప ప్రత్యక్షమైంది - తీతు 2,11. ఈ దైవకృపే క్రీస్తు పూర్వవేద యూదులు దేవుని ముఖాన్ని దర్శించడానికి భయపడ్డారు. ఏ నరుడూ ఆ భగవంతుణ్ణి దర్శించి బ్రతకలేడు అనుకొన్నారు - నిర్గ 33.20. కాని ఆ భగవంతుని తేజస్సే ఇప్పడు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తూంది. ఈ దివ్యశిశువుని మనం సమీపించగలం. ఇతనిద్వారా దేవుడు మనతో మాటలాడుతాడు, మనకు బోధ చేస్తాడు.