పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నరుడుగా తయారయ్యాడని భావం. ఇక యేసు దేవుడు కావడంవల్ల అతని కార్యాలు దైవకార్యాలయ్యాయి, ఆ దివ్యకార్యాలు మన పాపాలకు పరిహారం చేయగలిగాయి. అందుకే తండ్రికి ఆ కుమారుడంటే పరమప్రీతి, ఆ ప్రీతివల్లనే తండ్రి కుమారునిగూర్చి "ఇతడు నా ప్రియకుమారుడు. ఇతనినిగూర్చి నే నానందం చెందుతున్నాను" అని సాక్ష్యం పల్కాడు - మత్త 17,5. అతనిలో సర్వసంపూర్ణత నెలకొని వండాలని దేవుని అభీష్టం - కొలో 1,19.

2. ఇద్దరు ఆదాములు

మొదటి ఆదాముకీ రెండవ ఆదాము ఐన క్రీస్తకీ పోలికలున్నాయి. వీళ్ళిద్దరూ మనలాగ ప్రత్యేక వ్యక్తులు మాత్రమే కాదు, మానవసమాజాన్నంతటినీ తమలో ఇముడ్చుకొన్న సామూహిక వ్యక్తులుకూడ. మొదటి ఆదాము పూర్వమానవ జాతికి పిత. అతనిద్వారానే నరులందరికీ భౌతికజీవం లభించింది. కాని అతనిద్వారానే మానవజాతి ఆధ్యాత్మికజీవం కోల్పోయిందికూడా. ఇక, రెండవ ఆదాము ఐన క్రీస్తు నూత్నమానవజాతికి పిత. ఇతనిద్వారా మానవలోకానికి భౌతికజీవంగాక, ఆధ్యాత్మికజీవం లభించింది. మొదటి ఆదామువల్ల మనం కోల్పోయిన దివ్యజీవనం ఇతనిద్వారా పునరుద్ధరింపబడింది. ఆదామునుండి అందరు ఏలా మృతి జెందుతున్నారో ఆలాగే క్రీస్తునందు అందరూ జీవం పొందుతున్నారు - 1కొ 15,22.

3. నరునినుండే నరునికి రక్షణం

క్రీస్తు మనుష్యావతారం ద్వారా, పతనమైన మానవజాతి తన్నుతానే ఉద్ధరించుకోగలిగింది. అసలు మనుష్యావతారంతో అవసరం లేకుండానే దేవుడు నరుల పాపాలను పరిహరించి వుండవచ్చు, కాని ఈ పద్ధతి మన స్వాతంత్ర్యాన్నికించపరుస్తుంది. నరులు తమ పాపాలకు తామే పరిహారం చేసికొంటే వాళ్ళకు గౌరవంగా వుంటుంది. ఐతే పతనమైన మానవజాతి తన పాపాలకు తాను ఏలా పరిహారం చేసికోగలదు? కనుకనే దేవుడు పాపరహితుడైన క్రీస్తుని మన నరజాతిలోనికి ప్రవేశపెట్టాడు. అతడు మనలందరినీ తనలో ఇముడ్చుకొని మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసాడు. ఆ పావనమూర్తితో ఐక్యమై మన పాపాలకు మనం పరిహారం చేసికోవచ్చు. విరిగిపోయిన మొక్క తన్నుతానే చక్కజేసికొంటుంది. అలాగే పతనమైన నరజాతికూడ క్రీస్తుతో ఐక్యమై తన్నుతానే ఉద్ధరించుకొంది. దేవునికీ మనకీ మధ్య వుండి తెగిపోయిన వంతెన క్రీస్తు రాకడతో మళ్ళా నిర్మింపబడింది. ఆ దేవుడే మనవద్దకు వచ్చాడు కనుక మనం ఆ దేవుని చెంతకు వెళ్ళవచ్చు.