పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పలికారు. దేవుడుకాని, ఏలీయాకాని క్రీస్తుని రక్షించడానికి రారని వాళ్ళ భావం. యిప్రాయేలునూ సకలమానవాళినీ రక్షించడానికి వచ్చిన ప్రభువు ఇప్పడు తన రక్షణం కొరకు తండ్రికి మనవిచేస్తున్నాడు. యూదులు గ్రహింపలేని పద్ధతిలో తండ్రి తన కుమారుణ్ణి రక్షిస్తాడు. అతనిద్వారా సమస్తమానవాళిని కూడ రక్షిస్తాడు.

"యేసు తిరిగి బిగ్గరగా కేకవేసి ప్రాణాలు విడిచాడు"—27,50. మత్తయి ఈ చిన్నవాక్యంలో క్రీస్తు మరణాన్ని వర్ణించాడు. కాని ఇది యెంత చిన్నవాక్యమో అంతలోతైంది. ఉదయం తొమ్మిది నుండి సాయంకాలం మూడుదాకా - అనగా ఆరుగంటల దాకా ప్రభువు సిలువ మిూద వ్రేలాడుతూ దారుణబాధలు అనుభవిస్తున్నాడు – మార్కు 15,25. తన చివరిగడియల్లో "ఏలీ ఏలీ" అనే 22వ కీర్తనను జపించడం ప్రారంభించాడు. ఆ కీర్తననే మళ్లామత్తా జపిస్తూ ప్రాణాలు విడిచాడు. కనుక ఈ సందర్భంలో అతడు “బిగ్గరగా కేకవేసాడు" అంటే 22వ కీర్తనను పెద్దగా జపించాడనే అర్థం.

ఇక్కడ ప్రభువు బిగ్గరగా వేసిన కేకను అతని విజయ నాదాన్నిగా గూడ అర్థం జేసికోవాలి. శత్రువులు క్రీస్తు ఓడిపోయాడనుకొన్నారు. తండ్రి అతన్ని విడనాడాడు అని తలంచారు. అతడు నిరాశతో దిక్కులేని చావు చస్తాడు అని భావించారు. కాని క్రీస్తు సిలువ విూద నిరాశ చెందలేదు. తన బొందిలో శ్వాస వున్నంతకాలం తండ్రిని పూర్తిగా విశ్వసించాడు. తండ్రిగూడ కుమారుని ఆత్మార్పణను ప్రీతితో అంగీకరించాడు. కనుక క్రీస్తు విజయనాదం చేసి ధైర్యంగా ఉత్సాహంగా ప్రాణాలు విడిచాడు. ఈ పట్టున అతడు సిలువపై జపించిన 22వ కీర్తనం గూడ

"దీనులు తనకు మొరపెట్టినపుడు
దేవుడు వారి వేడుకోలును ఆలిస్తాడు"

అని చెప్పంది 22,24. కనుక తండ్రి క్రీస్తు వేడుకోలును విన్నాడు అనుకోవాలి.

క్రీస్తు సిలువమిూద "ప్రాణాలు విడిచాడు". అనగా దేవుడు తనకిచ్చిన ప్రాణాన్ని తిరిగి దేవుని చేతుల్లోకే సమర్పించాడు. మనం పుట్టినపుడే దేవుని శ్వాస మనలోనికి ప్రవేశిస్తుంది - ఆది 2,7. మనం చనిపోయినపుడు ఆ శ్వాసను మల్లా దేవునికే అర్పిస్తాం = ఉపదేశ 12,7. ఈ శ్వాస మన ఆత్మే క్రీస్తకూడ తన ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టాడు.

ప్రభువు తన ప్రాణాన్ని దేవునికి అర్పించడంలో అతని పరిపూర్ణ విధేయత వ్యక్తమౌతుంది. క్రీస్తు సిలువపై ఆత్మార్పణం చేసికోవాలని తండ్రి నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని క్రీస్తు అంగీకరించాడు. దానికి బద్దుడయ్యాడు. ఆ సిలువ మరణాన్ని గూర్చి ముందుగానే మూడుసార్లు శిష్యులను హెచ్చరించాడు. గురువారం రాత్రి జరిగిన కడపటి విందు నుండి ఆ గడియ కోసం ఎదురుచూస్తున్నాడు. కయిఫా పిలాతు మొదలైన అధికార్ల