పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు గురువారం రాత్రి నుండి తీవ్రమైన వేదనలో వున్నాడు. కనుక అలసిపోయి వున్నాడు. సిలువను మోయలేని స్థితిలో వున్నాడు. కావున రోమను సైనికులు కురేనియా నుండి వచ్చిన సీమోనుని క్రీస్తు సిలువను మోయమని నిర్బంధం చేసారు. ఈ కురేనియా ఆఫ్రికా ఉత్తర భాగంలో వుంది. సీమోను అక్కడినుండి పాస్క తిరునాళ్ళకు యెరూషలేము వచ్చాడు. సిలువలో నిలువుమాను అడ్డమాను వుంటాయి కదా! నిలువుమాను గొల్గొతా కొండమిూదనే వుంది. క్రీస్తుగాని సీమోనుగాని మోసికొని వెళ్ళింది అడ్డమాను మాత్రమే.

సీమోనుకి మొదటలో క్రీస్తు సిలువను మోయడం ఇష్టం లేదు. అది అవమానకరమైన కార్యం. ఆ రోజుల్లో సిలువ నీచవస్తువు. సైనికుల నిర్భంధానికి లొంగి అతడు సిలువమానుని భుజాల మిూదికి ఎత్తుకొన్నాడు. కాని ప్రభువు వరప్రసాద ప్రభావం వల్ల తర్వాత అతని మనసు మారింది. అతడు ప్రభువుకి శిష్యుడయ్యాడు. అతని యిద్దరు కుమారులైన అలెగ్జాండర్, రూఫస్ తొలినాటి క్రైస్తవ సమాజంలో మంచిపేరు కలవాళ్లు - మార్కు 15,21. సీమోను లాగే కొందరు అనిష్టంతో దైవసేవలో చేరతారు. కాని తర్వాత గొప్పదైవభక్తులౌతారు. ప్రభువు వరప్రసాదం మన హృదయాలను మార్చివేస్తుంది.

సీమోనులాగే నేడు మనం కూడ క్రీస్తు సిలువను మోయాలి. నన్ను అనుసరింపగోరేవాడు నా సిలువను మోసికొని నా వెంట రావాలని ప్రభువు నుడివాడు కదా! - మత్త 16,24. "క్రీస్తు వెంట మోసికొని రావడానికి సిలువను సీమోను భుజాల విూద పెట్టారు" అని చెప్తుంది లూకా సువిశేషం - 28,26. మన బాధ్యతలు, కష్టాలు, మరణం మొదలైనవన్నీ కూడ నేడు మనం మోసే సిలువలే.

సీమోను క్రీస్తు సిలువను మోసిన ఉదంతం తర్వాత పుణ్యస్త్రీల ఉదంతం వస్తుంది. ఈ యంశం లూకా సువిశేషంలో మాత్రమే కన్పిస్తుంది - లూకా 23,27-31. ఈ పుణ్యాంగనలు యెరూషలేము నివాసులు. వీళ్ల సిలువను మోసే క్రీస్తు పట్ల సంతాపం చూపుతూ విలపించారు. క్రీస్తు వారిని తన కొరకు కాక వారికొరకూ వారి బిడ్డల కొరకూ దుఃఖించమన్నాడు. ఎందుకు? క్రీ.శ.70లో రోమిూయులు వచ్చి యెరూషలేం నగరాన్ని సర్వనాశం చేస్తారు. అప్పడు యెరూషలేం నివాసులు చాలమంది చస్తారు. క్రీస్తుని నిరాకరించినందుకు తండ్రి వారిమిూదికి పంపే శిక్ష అది. ఈ శిక్షను గూర్చి క్రీస్తు ముందుగానే హెచ్చరించాడు - లూకా 19,42–44.

యూదులు సంతానాన్ని దేవుని దీవెనగా భావించారు. వంధ్యత్వాన్ని శాపంగా ఎంచారు. కాని యెరూషలేము వినాశకాలంలో గొడ్రాళ్ళయిన స్త్రీలే ధన్యులని చెప్పకొంటారు. ఎందుకు? బాలబాలికల చావును చూడలేక జనం అలా చెప్పకొంటారు. ఆ కాలంలో ప్రజలు ప్రభువు శిక్షకు భయపడి దేవుని కంటబడకుండ తమ్ము కప్పివేయమని పర్వతాలను బతిమాలుకొంటారు - హో షేయ 10,8.