పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కడి బేరగాళ్ళను వెళ్లగొట్టాడు. ప్రార్ధనాలయమైన దేవాలయాన్ని యూదనాయకులు దొంగల గుహగా మార్చారని కోపించాడు - 21,13. ఈ వాక్యం యీర్మియా ప్రవచనం 7,11-15 నుండి గ్రహింపబడింది. అక్కడ యిర్మీయా ప్రవక్త యావే ప్రభువు యెరూషలేం దేవాలయాన్ని నాశం చేస్తాడని ప్రవచించాడు. అలా ప్రవచించినందుకు ఆనాటి ప్రజలు యిర్మీయాకు మరణశిక్ష విధించగోరారు కూడ. ఇంకా, మెస్సియాకాలం వచ్చినపుడు భక్తులు అశుద్ధమైన యెరూషలేం దేవాలయాన్ని ధ్వంసం చేసి శుద్ధమైన దేవాలయాన్ని నిర్మిస్తారని కూడ యూదులు నమ్మారు.

ఈ సంగతులన్నీ మనసులో పెట్టుకొని పై యిద్దరు సాక్షులు క్రీస్తుపై నేరం తెచ్చారు. కాని వాళ్లు క్రీస్తు పల్కులను తారుమారు చేసారు. క్రీస్తు రోమియులు దేవళాన్ని పడగొడతారని చెప్పగా, సాక్షులు క్రీస్తే దేవాలయాన్ని పడగొడతానన్నాడని కొంత సత్యమూ కొంత అసత్యమూ చేర్చి చెప్పారు.

ఇక్కడ ఓ గూడార్థం వుంది. క్రీస్తుశకం 70లో టైటస్ అనే రోమన్ సైన్యాధిపతి వచ్చి యెరూషలేం దేవళాన్ని నేలమట్టం చేసాడు. నగరాన్ని కాల్చివేసి యూదులను ఊచకోత కోసాడు. కనుక అంతా క్రీస్తు ముందు చెప్పినట్లుగానే జరిగింది. కాని ఆనాడు న్యాయసభలో ఈ దేవాలయం ప్రస్తావనం వచ్చినపుడు అక్కడివాళ్లకెవరికీ భావిలో జరుగబోయే దేవాలయ విధ్వంసాన్ని గూర్చి తెలియదు. క్రీస్తుకి ఒక్కడికి మాత్రమే తెలుసు. మత్తయి తన సువిశేషాన్ని క్రీ||శ|70 తర్వాత వ్రాసాడు. యూద నాయకులు క్రీస్తుని నిరాకరించినందుకే వారికి ఈ విపత్తు దాపరించిందని అతడు నొక్కిచెప్పాడు. భూస్వామి కౌలుదార్ల సామెతలో, కౌలుదార్లు భూస్వామి కుమారుణ్ణి చంపివేస్తారు. అందుకు భూస్వామి ఆ దుషులైన కౌలుదార్లను మట్టుపెట్టాడు - మత్త 21,41. ఇక్కడ భూస్వామి యావే ప్రభువు. కౌలుదార్లు, యూదనాయకులు, కనుక దేవుడే ఆ నాయకులను శిక్షించాడని మత్తయి బోధ.

యెరూషలేము దేవాలయ పతనానంతరం ఉత్దాన క్రీస్తే మన దేవాలయ మయ్యాడు. ఉత్దాన క్రీస్తు, అతనితో ఐక్యమైన క్రైస్తవ సమాజమూ కలసి నేడు దేవాలయమౌతారు, మనం నిర్మించే రాతిగుళ్లకంటె ఇది ముఖ్యమైన దేవాలయం.

పై కూట సాక్ష్యం తర్వాత ప్రధాన యాజకుడు నీమీద వచ్చిన ఈ నేరానికి నీవేమి జవాబు చెప్తావని క్రీస్తుని ప్రశ్నించాడు. కాని యేసు సమాధానం చెప్పకుండా మౌనంగా వుండిపోయాడు - 26,68. పూర్వం బాధామయ సేవకుడు శత్రువులు తన్ను బాధిస్తున్నా పల్లెత్తుమాట అనలేదు. వధ్యస్థానానికి వెళ్లే గొర్రెపిల్లలాగే మౌనంగా వుండిపోయాడు. — యొష 58,7. ఇక్కడ మత్తయి క్రీస్తుని ఈ సేవకునితో పోల్చాడు.