పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/108

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ భాగంలో, అదేసభ మళ్లీ శుక్రవారం ప్రాతఃకాలాన సమావేశమై క్రీస్తుని చంపించాలని నిర్ణయించింది - 27.1-2. మూడవభాగంలో పిలాతు క్రీస్తుకి మరణ శిక్ష విధించాడు - 27,11-26.

శత్రువులు గురువారం రాత్రి క్రీస్తుని బంధించి ప్రధానార్చకుడైన కయిఫా ఇంటికి తీసకొని పోయారు. ఇక్కడే యూదుల న్యాయసభ లేక సానెడ్రిన్ సభ సమావేశమై క్రీస్తు దోషాలను పరిశీలించి చూచింది. కాని ఈ సభ ఈ రాత్రి తుది తీర్పు చెప్పలేదు. ఆకార్యం శుక్రవారం వేకువజామున జరుగుతుంది, శత్రువులు క్రీస్తుని ప్రధానార్చకుని యింటికి తీసికొని వస్తుంటే, పేత్రు కూడా అతన్ని దూరం నుండి అనుసరిస్తూ వచ్చాడు. అతడు కూడా ఆ యింటి లోపలికి వెళ్లాడు. ప్రధానార్చకుని తీర్పు పర్యవసానాన్ని చూడాలని అతని కోరిక, ఆ పర్యవసానంలో ప్రభువు మరణం ఇమిడే వుంది. యూద నాయకులు క్రీస్తుని సులువుగా వదలిపెట్టరని పేత్రు శంకించి ఉండవచ్చు. అతడు శంకించినట్లే అంతా జరుగుతుంది. ఆ సమయంలో పేత్రు ధైర్యంగా ప్రధానార్చకుని యింటిలోనికి వెళ్ళినందుకు అతన్ని అభినందించాలి. ఈ సందర్భంలో మార్కు సువిశేషం అతడు కయిఫా యింట సేవకులతో కలసి చలిమంట వద్ద కూర్చున్నాడని చెప్పంది - మార్కు 14,54. కాని మత్తయి ఈ యంశాన్ని వదలివేసాడు. అతడు ఈలాంటి వివరాలను అట్టే పట్టించుకోడు.

క్రీస్తుని నాశం చేయడానికై సానెడ్రిన్ సభ అసత్య సాక్ష్యాలు వెదికింది - 26,59. అనగా మొదటినుండి ఈ సభ దురుద్దేశంతోనే ప్రవర్తించింది. అది న్యాయసభ ఐనా అన్యాయంగా మెలిగింది. అక్కడివాళ్లు చాలమంది క్రీస్తుకి వ్యతిరేకంగా కూటసాక్ష్యం చెప్పబోయారు కాని అది కుదరలేదు.

చివరకు ఇద్దరు సాక్షులు లేచి ఇతడు నేను దేవాలయాన్ని పడగొట్టనూగలను దాన్ని తిరిగి నిర్మంచనూగలను అని పల్మాడు అని చెప్పారు - 27,61. ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కరి సాక్ష్యం చెల్లదు, ఇద్దరి సాక్ష్యం కావాలి - ద్వితీయ 17,6. కనుకనే మత్తయి ఇక్కడ ఇద్దరు సాక్షులను పేర్కొన్నాడు. మత్తయి భావాల ప్రకారం క్రీస్తు నేను దేవాలయాన్ని పడగొడతాను అనలేదు. దాన్ని పడగొట్టే శక్తి పునర్నిర్మించే శక్తి తనకు ఉందని మాత్రమే పల్కాడు.

అసలు ఈ కూట సాక్ష్యంలో నిజమెంత? నేను యెరూషలేము దేవాలయాన్ని పడగొడతానని క్రీస్తు నేరుగా ఎక్కడా చెప్పలేదు. కాని భావికాలంలో రోమికాయులు వచ్చి ఆ దేవాలయాన్ని కూలద్రోస్తారని మాత్రం చెప్పాడు. ఈ దేవాలయాన్ని రాతిమిూద రాయి నిలువకుండా పడగొడతారని పల్మాడు -242. పైగా అతడు దేవాలయాన్ని శుద్ధిచేసాడు.