పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధ్యాత్మిక మానవుడు విజృంభించాలి, పాపపు మానవుడు కూలిపోవాలి. కాని శిష్యుల్లో ఈ సూత్రం కేవలం భిన్నంగా వుంది. ఇక్కడ భావం ఇది. మన ఆత్మలో దైవాత్మసాన్నిధ్యం వుంటుంది. దీనితో మనం శోధనలను జయించగలం. కాని మనలో పాపగుణం కూడ వుంటుంది. ఇది మనలను బలహీనులను చేస్తుంది. మనం శోధనలకు లొంగిపోయేలా చేస్తుంది. కనుకనే క్రీస్తు శిష్యులను మేల్కొని వుండి ప్రార్ధనం చేయమన్నాడు. ఆ ప్రార్ధన ద్వారా శోధనను జయించమన్నాడు. ఇక్కడ శోధనమంటే యూదా ద్వారా రాబోయే పిశాచశక్తి. ఈ శక్తి క్రీస్తుని తండ్రికి విధేయుడవు కావద్దని ప్రేరేపిస్తుంది. శిష్యులను మరణకాలంలో క్రీస్తుకి అండగా వుండవద్దని ప్రేరేపిస్తుంది. క్రీస్తు ఈ శక్తికి లొంగడు. శిష్యులు మాత్రం లొంగిపోతారు. కనుకనే వాళ్ల ముందుగా ప్రార్ధనం చేసికొని ఈ దుష్ట శక్తిని ఓడించాలి.

మత్తయి సువిశేషంలో క్రీస్తు శిష్యులను చాలసార్లు "అల్ప విశ్వాసులారా" అని సంబోధించాడు. అల్ప విశ్వాసి అంటే ఆధ్యాత్మిక నరుడుగాగాక పాపపు నరుడుగా ప్రవర్తించడమే - 14,31.

క్రీస్తు రెండవసారి కూడ పూర్వపు ప్రార్థననే చేసాడు. కాని రెండవసారి ఈ పాత్ర తొలగిపోకుంటే నేను దాన్ని త్రాగడానికి సంసిద్దుణ్ణి అని అన్నాడు - 26,42. అనగా అతడు దైవచిత్తానికి అధికాధికంగా విధేయుడయ్యాడని అర్థం జేసికోవాలి. అతడు మూడవసారి కూడ మొదటిరీతినే ప్రార్థించాడు. అనగా తాను తండ్రిపట్ల భక్తి విశ్వాసాల తోను వినయవిధేయతలతోను చేసిన ఆ తొలి ప్రార్థననే తిరిగితిరిగి చేసాడు. మనం తరచుగా ప్రార్థనను కొనసాగించం. అందువల్ల పొందవలసిన వరప్రసాదాలు కూడ పొందం.

మూడవసారి ప్రార్థన చేసి ముగించాక అతడు శిష్యుల దగ్గరికి వచ్చి వారిని నిద్ర లేపాడు. మనుష్య కుమారుని పాపులకు అప్పగించే సమయం రానే వచ్చింది. ఇక లెండి, పోదాం అన్నాడు - 26,45-46. క్రీస్తు సమయం, అనగా అతన్ని అప్పగించే గడియ ఆసన్నమైంది. అతడు మేల్కొని వుండి ప్రార్ధన చేసికొని బలాన్ని పొందాడు. ఆ విషమ సంఘటనను ఎదుర్కోడానికి శక్తిని పొందాడు. ఆ శక్తితోనే అతడు శత్రువులను కలసికోవడానికి ముందుకి వెళ్లాడు. ఇక లేవండి శత్రువుల యెదుటికి వెళ్లాం అని శిష్యులను గూడ హెచ్చరించాడు - 26,46.

గెత్సెమని సంఘటనం మనకెన్నో భక్తిభావాలను నేర్పిస్తుంది. 1. రెండవ శతాబ్దంలో జీవించిన క్రైస్తవ వేదాంతి టెరూలియన్ సువిశేషాల్లోకి ఎక్కని క్రీస్తు వాక్యాన్ని